న్యూఢిల్లీ: సెలక్టర్ల తప్పిదాలతోనే వెస్టిండిస్ క్రికెట్ కీర్తిని మరింతగా దిగజార్చాయని ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో పేర్కొన్నాడు. ఆస్టేలియాలో జరగనున్న బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన బ్రేవో మీడియాతో మాట్లాడాడు. అంతర్జాతీయ క్రికెట్లో విండిస్ పేరు ప్రఖ్యాతులు క్రమేపీ క్షీణించిపోవడానికి బోర్డు వైఖరే కారణమని వ్యాఖ్యానించాడు.
'విండీస్‌కు ఆడటాన్ని ఇప్పటికీ ఎంతో గౌరవంగా భావిస్తా. సెలక్టర్ల తప్పిదం వల్ల టెస్టు క్రికెట్ నుంచి బలవంతంగా బయటికి వచ్చా. ఇంకా దేశం తరపున టెస్టు క్రికెట్ ఆడాలన్న కోరిక నాలో ఉంది. కానీ ఏ సెలెకర్ట్ నన్ను పిలుస్తాడు. ఒకవేళ పిలిస్తే నా పొజిషన్ ఏమిటి అనేది వారే నిర్ణయించాలి' అని బ్రేవో ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇప్పటికీ తాను వెస్టిండిస్ జట్టు తరుపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. వన్డేలు, టీ20ల్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. అంతేకాదు తన క్రికెట్ భవిష్యత్తును మరింతగా
మెరుగుపర్చుకునే పనిలో భాగంగానే వివిద దేశాల్లో పలు టోర్నీల్లో ఆడుతూ ముందుకు సాగుతున్నానని బ్రేవో పేర్కొన్నాడు.
32ఏళ్ల బ్రేవో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 40 టెస్టులు ఆడి 2,200 పరుగులు చేయగా ఇందులో మూడు సెంచరీలున్నాయి. 86 వికెట్లు తీసుకున్నాడు. గత జనవరిలో టెస్టు ఫార్మెట్ నుంచి బయటకు వచ్చిన బ్రేవో చివరి టెస్టు మ్యాచ్‌ను 2010 డిసెంబర్‌లో ఆడాడు.
2013లో వన్డే కెప్టెన్‌గా ఎంపికైన బ్రేవో ఏడాదిన్నరలోపే కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. 2014 అక్టోబర్‌లో ధర్మశాలలో టీమిండియా జరిగిన నాలుగో వన్డే అనంతరం ఆటగాళ్ల పారితోషకాలపై మద్దతుగా నిలిచి పర్యటనను అర్ధారంతంగా రద్దు చేసుకోవడంతో విండీస్ బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు.