శ్రీలంక పర్యటనను వెస్టిండీస్ ఘనంగా ఆరంభించింది. దంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో శ్రీలంకపై అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో విండీస్ పైచేయి సాధించి మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 179 పరుగులు చేసింది.
కెప్టెన్ అసలంక (59; 35 బంతుల్లో, 9 ఫోర్లు), కామిందు మెండిస్ (51; 40 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు పేలవారంభం దక్కింది. 27 పరుగులకే ఓపెనర్లు నిస్సాంక (11; 10 బంతుల్లో, 2 ఫోర్లు), కుశాల్ మెండిస్ (19; 16 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్ పెరీరా (6; 3 బంతుల్లో, 1 ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన కామిందు మెండిస్, అసలంక ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓ స్థితిలో లంక 16 ఓవర్లకు 140/3తో మెరుగైన స్థితిలో ఉంది. కానీ వెస్టిండీస్ బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు తీసి స్కోరు వేగాన్ని తగ్గించారు. షెఫార్డ్ రెండు వికెట్లు, మోటియ్, అల్జారీ జోసెఫ్, షామర్ జోసెఫ్, స్ప్రింగర్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 19.1 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63; 33 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్), ఎవిన్ లూయిస్ (50; 28 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 55 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఓపెనర్ల విధ్వంసంతో విజయం దిశగా దూసుకెళ్తున్న వెస్టిండీస్‌ను లంక బౌలర్లు గొప్పగా అడ్డుకున్నారు.
చివరి 5 ఓవర్లకు 32 పరుగులుగా విజయ సమీకరణాన్నిమార్చారు. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకువచ్చారు. కానీ జట్టును గెలిపించలేకపోయారు. లంక బౌలర్లలో పతిరనా రెండు, కామిందు మెండిస్, హసరంగ, తీక్షణ తలో వికెట్ తీశారు.