'ఆ భారత ఆటగాడు మాత్రమే టీ20ల్లో డబుల్ సెంచరీ చేయగలడు'!!

హైదరాబాద్: టీ20ల్లో డబుల్ సెంచరీ కొట్టే అవకాశం భారత ఓపెనర్ రోహిత్ శర్మకు ఉందని టీమిండియా మాజీ క్రికెట్ యువరాజ్ సింగ్ అన్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ కూడా పొట్టి ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసే సామర్థ్యం ప్రస్తుత క్రికెటర్లలో రోహిత్ శర్మకి మాత్రమే ఉందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ ప్రపంచంలోని ఏ క్రికెట్ గ్రౌండ్‌లోనైనా అలవోకగా సిక్సర్లు రాబట్టగలడు, అతని స్ట్రైక్‌రేట్ అద్భుతం అని ప్రశంసించాడు.

రోహిత్ మాత్రమే చేయగలడు:
తాజాగా బ్రాడ్ హగ్ మాట్లాడుతూ... 'పొట్టి ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేయగల సామర్థ్యం ప్రస్తుతం రోహిత్ శర్మకి మాత్రమే ఉంది. టీ20ల్లో రోహిత్ స్ట్రైక్‌రేట్ (138.79) బాగుంది. అతడి షాట్ సెలక్షన్, టైమింగ్, షాట్స్ అమోఘం. ప్రపంచంలోని ఏ క్రికెట్ గ్రౌండ్‌లోనైనా అలవోకగా సిక్సర్లు బాదగలడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నదంటే.. భారీ స్కోర్ చేస్తాడు. అతడే పొట్టి ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేయగలడు' అని బ్రాడ్ హగ్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్, ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ అరోన్ ఫించ్‌లను కాదని టీమిండియా ఓపెనర్‌పై బ్రాడ్ హగ్ నమ్మకంగా ఉన్నాడు.

టీ20ల్లో రోహిత్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 118:
రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసాడు. టెస్టుల్లోనూ గత ఏడాది డబుల్ అందుకున్నాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 118. రోహిత్ అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటికే నాలుగు శతకాలు చేయగా.. ఐపీఎల్‌లో ఓ సెంచరీ బాదాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ ఇప్పటివరకూ 108 మ్యాచ్‌లు ఆడి 2,773 పరుగులు చేశాడు. ఇందులో 127 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు 188 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 4,898 పరుగులు చేయగా.. 194 సిక్సర్లు బాదాడు.

ఫించ్ పేరిట రికార్డు:
టీ20ల్లో రోహిత్ ఇప్పటివరకూ నాలుగు శతకాలు సాధించగా.. మరే క్రికెటరూ ఈ ఘనతనందుకోలేదు. ఆసీస్‌కు చెందిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, న్యూజిలాండ్ హార్డ్ హిట్టర్ కొలిన్ మున్రోలు తలో మూడు సెంచరీలతో రోహిత్ తర్వాత స్థానంలో ఉన్నారు. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఆసీస్ ఆటగాడు అరోన్ ఫించ్ పేరిట ఉంది. 2018లో జింబాబ్వేపై ఫించ్ 172 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటికీ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అఫ్గానిస్థాన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్ 162 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ టీ20ల్లో అత్యధిక స్కోరు మాత్రం క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013లో ఆర్సీబీ తరఫున గేల్ అజేయంగా 175 పరుగులు చేసాడు.

ఆ ముగ్గురికే ఉంది:
గతంలో యువరాజ్ మాట్లాడుతూ.. 'టీ20ల్లో డబుల్ సెంచరీ చేయడం చాలా కష్టమని నేను భావిస్తాను. నన్నడిగితే అది అంత సులవుకాదని చెబుతాను. కానీ కాలంతో పాటు మారుతున్న ప్రస్తుత క్రికెట్‌ను చూస్తే సాధ్యం కానిది ఏదీ లేదనిపిస్తుంది. టీ20ల్లో డబుల్ సెంచరీ కొట్టే అవకాశం నా దృష్టిలో ముగ్గురికి ఉందని నమ్ముతున్నా. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మలకు టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించే సత్తా ఉంది' అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications