హైదరాబాద్: పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన బౌలర్లు, ఫీల్డర్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడాడు.
'ఇది మాకు చాలా మంచి గేమ్. టాస్ వేసినప్పుడు ఏదైతే చెప్పామో అదే చేశాం. బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫీల్లర్లు సైతం బాగా ఆడారు' అని అన్నాడు. కీలకమైన రెండో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజా విజయంతో మూడు వన్డేల సిరిస్ 1-1తో సమమైంది.
'ఆ ఇద్దరూ (భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా) చక్కగా ఆడుతుంటే చూడటం గొప్పగా ఉంది. తాము శుభారంభం ఇవ్వగలమని వారికి తెలుసు' అని కోహ్లీ అన్నాడు. 'ఈరోజు వికెట్ స్లోగా ఉన్నా, సంప్రదాయ పద్ధతిలో బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టారు' అని కోహ్లీ చెప్పాడు.

ఓపెనర్ శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ బాగా రాణించి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారని కోహ్లీ కొనియాడాడు. 'ధావన్ అద్భుతంగా ఆడాడు. ఇక, దినేశ్ కార్తీక్ నిలకడను ప్రదర్శించి జట్టు విజయాన్ని అందించాడు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా గత ఆదివారం ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఓటమి నేపథ్యంలో కీలకమైన రెండో వన్డేలో టీమిండియా అంచనాల మేరకు రాణించి ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.
అనంతరం 231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. సిరిస్ ఫలితం తేల్చే మూడో వన్డే ఆదివారం కాన్పూర్ వేదికగా జరగనుంది. మూడు వికెట్లు తీసి కివీస్ బ్యాట్స్ మెన్‌ను కట్టడి చేసిన భువనేశ్వర్ కుమార్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.