
జొహాన్నెస్‌బర్గ్: టీ20 ప్రపంచకప్ ఇంకొద్దిరోజుల్లో ఆరంభం కాబోతోంది. ఈ నెల 16వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. నెదర్లాండ్స్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడతాయి. 21వ తేదీన స్కాట్లాండ్-జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్‌తో గ్రూప్స్ దశ ముగుస్తుంది. ఆ తరువాతే అసలు పోరు ఉంటుంది. 22 తేదీ నుంచి సూపర్ 12 మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్.. ఆతిథ్య ఆస్ట్రేలియాను ఢీ కొడుతుంది. ఆ మరుసటి రోజే భారత్.. తన చిరకాల ప్రత్యర్ పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది.
24వ తేదీన దక్షిణాఫ్రికా తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ప్రత్యర్థి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే- గ్రూప్ దశలో గెలిచి సూపర్ 12కు క్వాలిఫై అయిన జట్టుతో ఆడాల్సి ఉంటుంది కాబట్టి. భారత పర్యటనకు వచ్చిన ప్రొటీస్ టీమ్.. చేదు అనుభవాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌ను కోల్పోయింది. ఈ రెండింట్లో కూడా 2-1 తేడాతో ఓడిపోయింది. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా గడ్డపై టీ20 వరల్డ్ కప్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది.
ఈ నేపథ్యంలో- దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆల్‌రౌండర్ మార్కో జన్‌సెన్‌ను జట్టులోకి చేర్చింది. ప్రస్తుతం రిజర్వ్ ఆటగాడిగా ఉన్నాడు మార్కో. డ్వైన్ ప్రిటోరియస్ గాయ పడినందు వల్ల అతని స్థానాన్ని జన్‌సేన్‌తో భర్తీ చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్‌ను తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్. జన్‌సెన్ స్థానంలో లిజార్డ్ విలియమ్స్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా తీసుకున్నట్లు తెలిపింది.
మార్కో జన్‌సేన్- భారత అభిమానులకు సుపరిచితుడే. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లను ఆడాడు. ఏడు వికెట్లు పడగొట్టాడు. 25 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతానికి అదే ఇతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. టీమిండియా ప్లేయర్లందరికీ బౌలింగ్ చేసిన అనుభవం ఉన్నందున అది ఉపయోగపడుతుందని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆశిస్తోంది.