క్రికెట్ మ్యాచుల్లో అంపైర్లు పొరపాట్లు చేయడం కొత్తేం కాదు. కానీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. ఒక్కో మ్యాచ్‌లో ముగ్గురు అంపైర్లు, స్కోరర్లు వేరు వేరుగా ఉంటారు. ఎవరి పని వాళ్లు చక్కగా చేయాలి. కానీ తాజాగా శ్రీలంక, న్యూజిల్యాండ్ మహిళల మ్యాచ్‌లో అంపైర్లు పెద్ద తప్పు చేశారు. కనీసం బౌలర్ వేసిన ఓవర్ల సంఖ్యను కూడా గుర్తుంచుకోలేకపోయారు.
శ్రీలంక, న్యూజిల్యాండ్ మహిళల మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ క్రమంలో రెండో వన్డేలో వింత ఘటన జరిగింది. ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ అమ్మాయిలు 329 పరుగుల భారీ స్కోరు చేశారు. కెప్టెన్ సోఫియా డివైన్ (138), అమీలియా కెర్ (108) సెంచరీలతో చెలరేగారు. దీంతో శ్రీలంక బౌలర్లు తేలిపోయారు. కివీస్ జట్టు 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడింది. కవిష దిల్హరి (84) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో ఆ జట్టు 48.3 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కివీస్ భారీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ల పొరపాటు వల్ల కివీస్ బౌలర్ ఈడెన్ కార్సన్ 11 ఓవర్లు వేసింది. గతంలో 55 ఓవర్ల వన్డే మ్యాచులు ఉండేవి. అప్పుడు ఐదుగురు బౌలర్లు తలో 11 ఓవర్లు వేసేవారు.
అయితే 1995లో చివరి 55 ఓవర్ల వన్డే జరిగింది. ఆ తర్వాత వన్డేలను 50 ఓవర్లకు కుదించేశారు. అప్పటి నుంచి బౌలర్లు 10 ఓవర్లకు మించి వేయకూడదు. కానీ న్యూజిల్యాండ్, శ్రీలంక అమ్మాయిల మధ్య మ్యాచ్‌లో ఈడెన్ కార్సన్ 11 ఓవర్లు బౌలింగ్ చేసింది. అంపైర్లు గమనించకలేదు. కెప్టెన్ సోఫీ డివైన్ కూడా మర్చిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఇలా 1995 తర్వాత ఒక బౌలర్ 11 ఓవర్లు వేయడం మహిళలు, పురుషుల క్రికెట్‌లో ఇది ఐదోసారి కావడం గమనార్హం.