
నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీతో ఒకే ఐపీఎల్లో మూడో సెంచరీ చేసిన ప్లేయర్‌గా జోస్ బట్లర్ నిలిచాడు. కేవలం 57బంతుల్లోనే సెంచరీ అందుకున్న బట్లర్ మొత్తం 65బంతుల్లో 9సిక్సర్లు , 9ఫోర్లతో 116పరుగులు చేశాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న బట్లర్.. ఐపీఎల్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. నోబాల్ వివాదం పక్కనపెడితే 15పరుగుల తేడాతో రాజస్థాన్ ఈ మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ మ్యచ్ ముగిశాక.. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న బట్లర్ మాట్లాడుతూ.. 'ఇది నాకు ప్రత్యేకమైన ఇన్నింగ్స్. నా ఫామ్‌ను నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఇది నా కెరీర్లో అత్యుత్తమ దశ. ముంబైలోని వాంఖడే స్టేడియం అంటే నాకు ఎంతో ఇష్టం. ఇక్కడొక మంచి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే నేను నా తొలి ఐపీఎల్ మ్యాచ్‌ను ఈ స్టేడియంలోనే ఆడాను. నేను ఇదే ఫామ్‌ను మున్ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నా' అని తెలిపాడు.
అలాగే మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ..'మొదటి ఓవర్లో బంతి చాలా స్వింగ్ అయింది. అలాంటి బంతులను డీల్ చేయడం కొంచెం కష్టమే. ఆ బంతులను తట్టుకోవాలి.. కాస్త ప్రెషర్ పెరిగినా ఒక్కసారి బంతి స్వింగ్, పేస్‌పైన కమాండ్ కుదిరితే మంచి ఇన్నింగ్స్ రాబట్టవచ్చు. నేను అదే చేశా. మరోవైపు దేవదత్ పడిక్కల్‌తో మంచి భాగస్వామ్యం నిర్మించడానికి ప్రయత్నించా.. పడిక్కల్ కూడా చాలా బాగా ఆడాడు. దీంతో షాట్లు ఆడుతూ ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ పరుగులు రాబట్టాం. అలాగే మంచు ప్రభావం ఎక్కువ లేకపోవడంతో మొదటి బ్యాటింగ్ చేసిన మా టీంకు కలిసొచ్చింది. బంతి చక్కగా బ్యాట్ మీదకి రావడంతో హిట్టింగ్ సులువైంది' అని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో బట్లర్ రెండు భారీ సిక్సులు బాదాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 10ఓవర్లో బట్లర్ 107మీటర్ల భారీ సిక్సర్ బాదిన బట్లర్.. ఆ తరువాత కుల్దీప్ యాదవ్ వేసిన 15ఓవర్‌లోనూ 105మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. బట్లర్ తన ఇన్నింగ్స్‌లో 36బంతుల్లో తొలి 50పరుగులు చేయగా.. మరో 50పరుగులను కేవలం 21బంతుల్లోనే పూర్తి చేసి.. తన హిట్టింగ్ గేర్‌ను మార్చాడు. అలాగే దేవదత్ పడిక్కల్ (54పరుగులు 35బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), కెప్టెన్ సంజూ శాంసన్ (46పరుగులు 19బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు నాటౌట్) చెలరేగడంతో రాజస్థాన్ 222పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనకు దిగిన ఢిల్లీ 207పరుగులు మాత్రమే చేయగలిగింది.