కాంట్రాక్టు నుంచి షమీని తప్పించే విషయం శాస్త్రి, కోహ్లీకి ముందే తెలుసు

Posted By:
Both Virat Kohli and Ravi Shastri were aware of Shami’s name missing on the contract list says BCCI

హైదరాబాద్: బీసీసీఐ బుధవారం ప్రకటించిన కొత్త కాంట్రాక్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని చోటు దక్కని సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలకు తెలుసు అని బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు తెలిపారు.

క్రికెటర్ షమీకి షాక్ మీద షాక్: అటు భార్య, ఇటు బీసీసీఐ

"షమీ వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలను, వార్తలను బోర్డు పరిగణనలోకి తీసుకుంది. షమిపై ఆరోపణలు చేసిన అతడి భార్య పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నివేదిక వచ్చే వరకు అతడి విషయంలో వేచిచూడడమే తెలివైన పని. మా నిర్ణయం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉండొచ్చునని కూడా చర్చించుకున్నాం. అందుకే అతడి పేరును కాంట్రాక్ట్‌ జాబితాలో ప్రకటించలేదు" అని ఆయన తెలిపారు.

"షమీ కాంట్రాక్ట్‌ను నిలిపే విషయంలో మేమే సందిగ్ధ స్థితిలో నిలిచాం. అవి వ్యక్తిగత ఆరోపణలైతే కాంట్రాక్ట్‌ ప్రొఫెషనల్‌కు సంబంధించినది కదా అనే సందేహం వచ్చింది. అయితే ఆరోపణలు ఇంత తీవ్రంగా ఉన్నా మీరు అతడికి గుర్తింపు ఇస్తున్నారు కదా అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంది" అని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలోనే చివరి నిమిషంలో అతని పేరును జాబితా నుంచి తప్పించినట్లు చెప్పారు.

మరోవైపు షమీని కాంట్రాక్టు నుంచి తప్పించిన తుది నిర్ణయం మాత్రం కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌(సీఓఏ)దేనని అన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలతో సీఓఏ చర్చించిదని తెలిపారు. కొత్త కాంట్రాక్టు జాబితాలో ఆదివారం వరకు షమీ పేరు ఉందని, ఆరోపణలు వచ్చిన తర్వాతనే షమీ పేరుని జాబితా నుంచి తొలగించడం జరిగిందని అన్నారు.

షమీకి చాలామంది యువతులు, మహిళలతో వివాహాతేర సంబంధాలున్నాయని అతడి భార్య హసిన్‌ జహాన్‌ బుధవారం మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. షమీ ఓ శృంగార పురుషుడని వ్యాఖ్యానించిన జహాన్‌.. విడాకులు ఇవ్వాలంటూ తనను షమీ కుటుంబం తనను వేధిస్తోందని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.

భార్య చేసిన ఆరోపణలపై షమీ కూడా స్పందించాడు. కెరీర్‌ పరంగా తనను దెబ్బతీసేందుకు కొందరు ఈ కుట్ర పన్నారని.. భార్య తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పాడు. తాజా వివాదంపై విచారణ పూర్తయ్యే వరకు షమీకి కాంట్రాక్ట్‌ దక్కదని బీసీసీఐ తేల్చి చెప్పింది.

Story first published: Thursday, March 8, 2018, 17:59 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి