వ్యక్తిగత కారణాలతో టీమిండియాకు దూరమైన విరాట్ కోహ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మూడో టెస్టు నుంచి కోహ్లి అందుబాటులో ఉంటాడనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గాయపడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు. అయితే జడేజా ఇంగ్లండ్ టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
అలాగే జడేజాతో పాటు స్టార్ పేసర్ మహ్మద్ షమి కూడా టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువని వివరించారు. ప్రస్తుతం షమి తన చీలమండల గాయం చికిత్స కోసం ఇంగ్లండ్‌కు వెళ్లాడని తెలిపారు. ''బీసీసీఐ ప్రెస్ నోట్ ప్రకారం.. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది. అయితే విరాట్ కోహ్లి తిరిగొచ్చే పరిస్థితులు ఉంటే కచ్చితంగా జట్టులో ఉంటాడు''

''మరోవైపు షమి గాయం నుంచి కోలుకుంటున్నాడు. అలాగే అతడితో పాటు రవీంద్ర జడేజా ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ రాహుల్ ఫిట్‌నెస్ సాధిస్తున్నాడు. మూడో టెస్టు ప్రారంభానికి ముందు పూర్తిగా కోలుకుంటాడు'' అని బీసీసీఐ అధికారి తెలిపారు.
కాగా, విరాట్ కోహ్లి రెండో సారి తండ్రి కాబోతున్న నేపథ్యంలో జట్టుకు దూరమయ్యాడని సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ మధ్యే తనకు ఈ విషయం తెలిసిందని, కోహ్లీకి మేసేజ్ చేయడంతో చెప్పాడని డివిలియర్స్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు తొలుత కోహ్లి ఎంపికయ్యాడు. జట్టుతో కలిసి సాధన చేసేందుకు హైదరాబాద్‌కు కూడా కోహ్లి చేరుకున్నాడు. కానీ వచ్చిన రోజు రాత్రి తిరిగి ఇంటికి పయనమయ్యాడు. ఆ మరుసటి రోజు కోహ్లి గురించి బీసీసీఐ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేసింది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరమయ్యాడని, అతడి వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరింది.