నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే కంగారూల గడ్డపై టీమిండియా ఈ సారి సిరీస్ గెలవాలంటే స్టార్ ప్లేయర్లు జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ ఎంతో కీలకమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నాడు. వారిద్దరు ఫిట్‌నెస్, ఫామ్‌తో ఉంటేనే తమ సొంతగడ్డపై భారత్ హ్యాట్రిక్ టెస్టు సిరీస్ సాధించడానికి అవకాశాలు ఉంటాయని తెలిపాడు.
2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే వరుసగా గెలుస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో పాటు ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌దే పైచేయి. స్వదేశంలో నిర్వహించిన 2016/17, 2022/23 సిరీస్‌ల్లో, అలాగే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2018/19, 2020/21లో సిరీస్‌ల్లో భారత్ విజయఢంకా మోగించింది. గత ఆస్ట్రేలియా పర్యటన భారత టెస్టు చరిత్రలో నిలిచిపోయింది. తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు నమోదు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత గొప్పగా పుంజుకుని 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.

అయితే ఈ సారి కూడా టీమిండియా గెలవాలంటే ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఫామ్‌ను కొనసాగించాలని ఇయాన్ చాపెల్ అన్నాడు. కారు ప్రమాదం తర్వాత తిరిగి టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్ అదరగొట్టడం భారత్‌కు సానుకూలాంశమని పేర్కొన్నాడు. 634 రోజుల తర్వాత బంగ్లాదేశ్ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి పునరాగమనం చేసిన పంత్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.
రీఎంట్రీలో పంత్ వికెట్ కీపర్‌గా మరింత మెరుగయ్యాడని, ఆస్ట్రేలియా పర్యటనలో అతను గేమ్ ఛేంజర్ అవుతాడని చాపెల్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా అయిదు టెస్టులూ ఆడేలా ఫిట్‌నెస్‌తో ఉండాలని అన్నాడు. బుమ్రాతో పాటు సిరాజ్ ఫిటెనెస్ కూడా టీమిండియాకు కీలకమని అన్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. యశస్వీ జైస్వాల్ నిలకడగా పరుగులు చేయడం కొనసాగించాలని, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి-రోహిత్ శర్మ యువకులకు కీలక సూచనలు అందివ్వాలని తెలిపాడు.
కాగా, నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి టెస్టు నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.