ఇటీవల బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి మరో బంపరాఫర్ దక్కనుంది. ఈ 21 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ అతిత్వరలోనే టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి నితీశ్‌ను బీసీసీఐ ఎంపిక చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత్-ఏ జట్టులో నితీశ్ రెడ్డికి చోటు దక్కింది.
ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియాలో కూడా నితీశ్ ఎంపిక దాదాపుగా ఖరారు అయినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో నవంబర్ 8 నుంచి ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు నితీశ్‌ను పక్కనపెట్టి, ఆసీస్ పర్యటనలో భారత్-ఏ తరఫున బరిలోకి దించనున్నారు. నితీశ్ రెడ్డితో పాటు మరో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు అనంతరం శార్దూల్ జట్టుకు దూరమయ్యాడు.

ప్రస్తుతం శార్దూల్ రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లను జట్టులోకి తీసుకోవాలా లేదా ఒక్కరికే మాత్రమే అవకాశామే ఇవ్వాలా అని సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. అక్టోబర్ 28వ తేదీన ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారాకు కూడా అవకాశం ఇచ్చే యోచనలో సెలక్టర్లు ఉన్నారు.
నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. కంగారూల గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లను టీమిండియానే కైవసం చేసుకుంది. 2016 నుంచి ఈ ట్రోఫీని వరుసగా భారతే గెలుస్తోంది. పెర్త్ వేదికగా నవంబర్ 22-26 వరకు తొలి టెస్టు, అడిలైడ్ వేదికగా డే/నైట్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.