వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టెస్టులో భారత్ 25 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (64) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన ప్లేయర్లు బ్యాట్లెత్తేశారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఆరు, గ్లెన్ ఫిలిప్స్ మూడు, హెన్రీ ఒక్క వికెట్ తీశారు.
ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ వైట్ వాష్‌కు గురికావడం ఇదే తొలిసారి. అంతేగాక ఈ ఏడాది సొంతగడ్డపై భారత్ ఓడిన టెస్టులు నాలుగు. 1969 తర్వాత స్వదేశంలో ఓ ఏడాది అత్యధిక టెస్టులు ఓడటం ఇదే ప్రథమం. 148 పరుగుల లక్ష్యాన్ని సాధించలేక ఈ అపకీర్తి మూటగట్టుకుంది.

ఈ ఘోరపరాజయం అనంతరం బీసీసీఐ అనధికారిక సమావేశాన్ని నిర్వహించింది. మైదానంలోనే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌తో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సుదీర్ఘంగా చర్చించాడు. అనంతరం బీసీసీఐ పెద్దలతో అగార్కర్ మాట్లాడాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు టీమిండియా అర్హత సాధించేలా బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 4-0తో గెలిస్తేనే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్స్ కు చేరుతుంది.
నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో, 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ విజయం సాధిస్తున్నప్పటికీ ప్రస్తుత ఫామ్‌తో రోహిత్‌సేన కంగారూల గడ్డపై ఈసారి విజయం సాధించిడం అంతతేలికైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను ఆసీస్ సిరీస్‌కు తీర్చిదిద్దేలా బీసీసీఐ కార్యచరణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా టీమిండియా కంటే ముందే కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌ను ఆస్ట్రేలియాకు వెళ్లాలని ఆదేశించింది.
నవంబర్ 7 నుంచి ఆస్ట్రేలియ-ఏ జట్టుతో భారత్-ఏ రెండో అనధికారిక టెస్టు ఆడనుంది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌కు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌ను అందుబాటులో ఉండాలని బీసీసీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం వీరిద్దరు ఆసీస్‌కు బయలుదేరనున్నారు. రిషభ్ పంత్‌కు మోకాలి గాయం తిరగబెడుతుందనే ఉద్దేశంతో ధ్రువ్‌ను బ్యాకప్‌గా సిద్ధం చేస్తోంది. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్‌కు బదులుగా అనుభవజ్ఞుడు రాహుల్ ఉండటమే తుదిజట్టులో ఉత్తమని భావిస్తోంది. ఈ క్రమంలో కంగారూల గడ్డపై వారికి మరింత ప్రాక్టీస్ ఉండాలని జట్టుతో కంటే ముందుగానే ఆసీస్‌కు పంపిస్తుంది.