సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం.
ఈ సిరీస్‌ను కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్‌తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. కాగా, గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో టీమిండియానే విజయం సాధించింది. 2018/19, 2020/21లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది.

అయితే గత ఆస్ట్రేలియా పర్యటనల్లో టీమిండియా విజయం సాధించడంలో కెప్టెన్‌గా విరాట్ కోహ్లి, కోచ్‌గా రవిశాస్త్రి ముఖ్య పాత్ర పోషించారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అన్నాడు. ఇప్పుడు అదే తరహా ప్రదర్శన ప్రస్తుత రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి ఆశించవచ్చా అని వాన్ ప్రశ్నించాడు. కోహ్లి నాయకత్వాన్ని రోహిత్ భర్తీ చేస్తాడా లేదా అని చూడాల్సి ఉందని, కానీ రవిశాస్త్రి లాంటి మరో కోచ్ అయితే దొరకడని అభిప్రాయపడ్డాడు.
''స్టీవ్ స్మిత్ తిరిగి నాలుగో స్థానానికి వచ్చాడు. అతను నిలకడగా పరుగులు చేస్తున్నాడు. ప్రశాంతతో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లికి ఆస్ట్రేలియాలో గొప్ప సక్సెస్ ఉంది. అయితే ఇరు జట్లలోని నాలుగో స్థానంలో వచ్చే ఈ బ్యాటర్లలో.. ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారనే దానిపై, ఆయా జట్ల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం కంగారూల గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగులను అంచనా వేయొచ్చు. కానీ బుమ్రా, కమిన్స్, స్టార్క్ వంటి బౌలర్ల ప్రదర్శనతో 350 స్కోరు కూడా తీవ్ర పోటీనిచ్చే స్కోరు''
''గత రెండు పర్యటన్లలో భారత్ విజయవంతమైంది. అప్పుడు వాళ్లకు ఆకర్షణీయమైన కోచ్ రవిశాస్త్రి ఉన్నాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఉన్నాడు. ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే ఒక్కటే మార్గమని నేను భావిస్తా. దూకుడుగా ఉంటూ ఓ అడుగు ముందుకేస్తూ ఎదుర్కొనేలా సిద్ధమవ్వాలి. రవిశాస్త్రి, విరాట్ కోహ్లి ఆ పనిచేశారు. అయితే ప్రస్తుత భారత శిబిరంలో రవిశాస్త్రి ఎవరు? మరో రవిశాస్త్రి లేడని నేను భావిస్తున్నాను. ఇక కెప్టెన్‌గా మరో కోహ్లి ఎవరు? రోహిత్ అలానే చేయగలడా? భారత్ మరికొన్ని వారాలు ఇదే కఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు.