స్వదేశంలో భారత్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని తొలి టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో 13 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది. ఓపెనర్‌గా నాథన్ మెక్‌స్వీనే ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా-ఏ తరఫున రాణించిన మెక్‌స్వీనే చోటు దక్కించుకున్నాడు. అతనితో పాటు జోష్ ఇంగ్లిస్ ఎంపికయ్యాడు. బ్యాటర్‌గా, బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇంగ్లిష్ సెలక్ట్ అయ్యాడు.
స్టీవ్ స్మిత్ తిరిగి నాలుగో స్థానానికి వెళ్లనున్నాడు. విరామం తీసుకున్న ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ తిరిగి ఎంపికయ్యారు. అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నాథన్ లైయన్ మాత్రమే ఎంపికయ్యాడు. ఇక పేస్ బాధ్యతలను ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ మోయనున్నారు. అలెక్సీ క్యారీ తొలి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.

నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. కాగా, 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే గెలుస్తోంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ భారత్‌దే విజయం. అదే జోరును కొనసాగించాలని టీమిండియా భావిస్తుండగా, తిరిగి బీజీటీ ట్రోఫీని గెలవాలని ఆసీస్ ఉవ్విళూరుతోంది. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకం. భారత్ 4-0తో గెలిస్తేనే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టైటిల్ పోరుకు చేరగలదు.
తొలి టెస్టుకు ఎంపికైన ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు).