ఇండియా vs ఆస్ట్రేలియా: భారత విజయంలో ఈ ఐదుగురిదే కీలకపాత్ర

హైదరాబాద్: రెండు వరుస విదేశీ పర్యటనల(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్) ఓటముల తర్వాత టీమిండియా మరో విదేశీ పర్యటనకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా గడ్డపై మరో కఠిన సవాల్‌కు టీమిండియా సిద్ధమైంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబర్ 6(గురువారం) అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
2003/04లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా టెస్టు సిరిస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఇదే ఆసీస్ గడ్డపై టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన. అంతకముందు 1980/81లో టీమిండియా డ్రాగా చేసుకున్నప్పటికీ, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా డ్రాగా ముగించిన ఈ సిరిస్ హైలెట్‌గా నిలిచింది.
2000 తర్వాత నుంచి ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు మొత్తం 17 టెస్టు మ్యాచ్‌లాడింది. ఇందులో భారత రెండింట విజయం సాధించి పదిలో ఓటమి పాలైంది. భారత్ విజయ శాతం 6.89గా ఉంది. చివరగా 2014-15లో ఆసీస్ గడ్డపై చివరిసారిగా భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడింది.
ఆ పర్యటనలో విరాట్ కోహ్లీ మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 692 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ సిరిస్‌లో స్టీవ్ స్మిత్(769) తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘకాలంగా పర్యటిస్తున్న భారత్ జట్టు ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా గెలవలేదు.
1947 నుంచి ఇప్పటివరకు టీమిండియా మొత్తం 12 సార్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా 9 సార్లు ఆతిథ్య విజయం సాధించగా, కేవలం మూడు సార్లు టెస్టు సిరిస్‌లను డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి టెస్టు సిరీస్‌ని గెలిచిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాలని కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఆసీస్ గడ్డపై భారత విజయంలో కీలకపాత్ర పోషించే ఐదుగురు ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దామా...

విరాట్ కోహ్లీ
ఈ ఏడాది విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో మూడు మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 286 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మొత్తం 593 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో కోహ్లీ ఈ ఏడాది ఆడిన మొత్తం పది మ్యాచ్‌ల్లో 1063 పరుగులు(18 ఇన్నింగ్స్‌లు) చేశాడు. ఇందులో మొత్తం నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక, ఆసీస్ గడ్డపై విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. చివరగా 2014-15లో ఆసీస్ గడ్డపై చివరిసారిగా భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడింది. ఆ పర్యటనలో విరాట్ కోహ్లీ మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 692 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.

అజ్యింకె రహానే
విదేశీ పిచ్‌లపై నిలకడగా ఆడే ఆటగాళ్లలో అజ్యింకె రహానే ఒకడు. అయితే గత కొంత కాలంగా రహానే బ్యాటింగ్‌లో తీవ్రంగా తడబడుతున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఏడాది సఫారీ గడ్డపై జరిగిన తొలి రెండు టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయిన రహానే... జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన చివరి టెస్టులో భారత జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ పేలవ ప్రదర్శన చేశాడు. మొత్తం ఐదు టెస్టుల్లో 257 పరుగులు చేసి నిరాశపరిచాడు.
ఇందులో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఇక, ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో సైతం పరుగులు రాబట్టడంలో రహానే పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, 2014 ఆస్ట్రేలియా పర్యటనలో మాత్రం రహానే పరుగుల వరద పారించాడు. మొత్తం నాలుగు టెస్టుల్లో 399 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆసీస్ గడ్డపై రహానే అత్యుత్తమ స్కోరు 147.

జస్ప్రీత్ బుమ్రా
డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా జస్‌ప్రీత్ బుమ్రాకు పేరు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విజయవంతమైన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బుమ్రా ఈమధ్య టెస్ట్‌ల్లోనూ రాణిస్తున్నాడు. తనదైన బౌలింగ్ యాక్షన్‌తో బ్యాట్స్‌మెన్ బోల్తా కొట్టించే ఈ యువ బౌలర్ ఇప్పటివరకు ఆడిన ఆరు టెస్ట్‌ల్లో 25.57 సగటుతో 28 వికెట్లు తీశాడు. తాజాగా ఆస్ట్రేలియాలోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ సిరిస్‌లో భారత విజయంలో జస్ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

కుల్దీప్ యాదవ్
ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టీ20ల సిరిస్ సమం కావడంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌దే కీలకపాత్ర. మూడు టీ20ల్లో కలిపి మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత అమ్ముల పొదిలో కుల్దీప్ యాదవ్ అస్త్రం లాంటివాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగల సమర్ధుడు. 2017లో ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఐదు టెస్టు మ్యాచ్‌లాడిన కుల్దీప్ యాదవ్ 19 వికెట్లు తీశాడు. ఇక, స్వదేశంలో వెస్టిండిస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలిసారి ఐదు వికెట్ల హాల్‌ను తీశాడు.

మహమ్మద్ షమీ
విదేశీ పర్యటనల్లో రాణించే పేస్ బౌలర్లలో మహమ్మద్ షమీ ఒకడు. సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల్లో షమీ 15 వికెట్లు తీశాడు. జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో షమీ 5/28తో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక, ఇంగ్లాండ్ సిరిస్‍లో సైతం షమీ తనదైన ముద్ర వేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో మొత్తం ఐదు టెస్టుల్లో 16 వికెట్లు తీశాడు. దీంతో గురువారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న టెస్టు సిరిస్‌లో సైతం షమీ రాణిస్తాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications