
హైదరాబాద్: ఎంత కొట్టి పడేసినా, దాచిపెట్టేసినా నిజాలు బయటికొచ్చేస్తాయ్. ఇలా మన పాండ్యా ప్రేమ లేదూ.. ఏమీ లేదంటూ తీసి పడేశాడు. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందంటూ పరోక్షంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇటీవలే తాజాగా మీడియా ముందు మళ్లీ దొరికిపోయాడు.
దీంతో ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్య.. ప్రేమలో ఉన్నాడా? అనే సందేహాలు బలపడ్డాయి. ఈ ఫొటోలే అందుకు సాక్ష్యం. ఇంతకీ పాండ్య ఎవరి ప్రేమలో ఉన్నాడో తెలుసా? పాండ్య అభిమానులకు ఇప్పటికే ఆమె ఎవరో తెలిసే ఉంటుంది. గతంలో కూడా వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ మీడియాకు చిక్కారు. తాజాగా మరోసారి వీరు జంటగా కనిపించి వైరల్ అయ్యారు.
పాండ్య బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలం వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె హార్దిక్ సోదరుడు కృనాల్ వివాహానికి కూడా విచ్చేసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే గాసిప్స్ పెరిగాయి. దీనిపై హర్దిక్‌ను ప్రశ్నిస్తే.. ''ఇందులో నేను చెప్పేది ఏమీ లేదు. నేను ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు కూడా. అయినా, ఎవరేమనుకుంటే నాకేంటి?'' అంటూ తప్పించుకున్నాడు.
అయితే, ఎల్లీ అవ్రామ్.. సోమవారం హార్దిక్‌ను ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దించి స్వీట్‌గా సెండాఫ్ ఇచ్చింది. పాపం ఆమె తన ముఖం కనపడకుండా ఎంత దాచుకున్నా మీడియా కనిపెట్టేసింది. అయితే, హార్దిక్ మీడియాతో మాట్లాడకుండానే లగేజ్‌తో హడావిడిగా ఎయిర్‌పోర్ట్ లోకి వెళ్లిపోయాడు. వీరి ప్రేమ నిజమైతే.. త్వరలో మరో క్రికెట్-బాలీవుడ్ జంటను చూడవచ్చేమో!