
హైదరాబాద్: మ్యాచ్ జరుగుతుండగా భద్రతా సిబ్బంది కళ్లు గప్పి దూసుకొచ్చాడు ప్రేక్షకుడు. నేరుగా కోహ్లీ దగ్గరకొచ్చి సెల్ఫీ కావాలని అడిగాడు. దానికి స్పందించిన కోహ్లీ అతనిని వారించలేదు. సెల్ఫీ తీసుకోవడానికి అనుమతినిచ్చాడు. ఇదంతా శనివారం రాత్రి జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
బెంగళూరు బ్యాటింగ్ చేస్తోంది.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్ క్రీజులో ఉన్నారు. అది ఐదో ఓవర్. హఠాత్తుగా ఓ యువకుడు మైదానంలోకి వచ్చేశాడు. పరిగెత్తుకుంటూ కోహ్లీ వద్దకు వెళ్లాడు. ఒక్క సెల్ఫీ కావాలని విరాట్‌ను కోరాడు. అయితే ఆ వీరాభిమానిపై కోహ్లీ ఎలాంటి ఆగ్రహాన్ని చూపించలేదు. సెల్ఫీ తీసుకుంటుంటే అడ్డు చెప్పలేదు.
వెంటనే అక్కడికి చేరుకున్న గ్రౌండ్ సిబ్బంది ఆ యువకుడిని బయటికి తీసుకెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేయలేదు. ఒకవేళ ప్రసారం చేసి ఉంటే ఈపాటికి కోహ్లీ తన అభిమానిపై చూపించిన ఉదారతకు ఇప్పటికే బోలెడన్ని ప్రశంసలు వచ్చి పడేవి.
కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మళ్లీ ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది. ఏబీ డివిలియర్స్ (72), విరాట్ కోహ్లి (70) చెలరేగడంతో ఢిల్లీ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో రాణించినా పేలవ బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఓడి ప్లే ఆఫ్ రేసు నుంచి ఢిల్లీ తప్పుకుంది. ఇక బెంగళూరు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలవగలిగితే ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.