
హైదరాబాద్: క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా (సీఏబీఐ)ను గుర్తించాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బీసీసీఐకి లేఖ రాయడంపై అంధుల క్రికెట్ టీమ్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. భారత అంధుల క్రికెట్ సంఘాన్ని గుర్తించాలని, వారిని బోర్డు పింఛను పథకం కిందకు తీసుకురావాలని కోరుతూ సచిన్ బోర్డు పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్‌కు బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే.
దీనిపై అంధుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే మహంతేష్ మాట్లాడుతూ సచిన్ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని తమ గురించి ఆలోచించడం సంతోషంగా ఉందని తెలిపారు. అందుకు జట్టు తరుఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. సచిన్ రాసిన లేఖను చదివి చాలా ఆనందించినట్టు ఆయన తెలిపారు.
'సచిన్ లేఖను చదివి చాలా ఆనందించాను. గత వారమే మేమంతా బీసీసీఐని సంప్రదించాం. మాకు మద్దతు ఇవ్వడానికి బోర్డు సుముఖంగానే ఉంది. అంధుల క్రికెట్ సంఘాన్ని గుర్తించాలని, ఆ క్రికెటర్లను అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరముందని సచిన్ లేఖ రాయడం ఎంతో గొప్ప విషయం' అని మహంతేష్ అన్నాడు.
'అంధుల వరల్డ్ కప్‌లో భారత్ వరుసగా రెండోసారి సాధించిన విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ సందర్భంగా మీకు ఒక విన్నపం. సీఏబీఐను బీసీసీఐ పరిధిలోకి తీసుకోండి' అని లేఖలో సచిన్ బీసీసీఐని కోరాడు. ఈ మేరకు బోర్డు పరిపాలకుల కమిటీ అధ్యక్షుడు వినోద్‌రాయ్‌కు లేఖ రాశాడు.
'అంధుల క్రికెట్‌లో రాణిస్తోన్న ఆటగాళ్లకు బీసీసీఐ మద్దతుగా నిలిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు. వారు సాధించిన విజయాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో అంధుల క్రికెట్ విస్తరిస్తుంది. ఈ ఛాంపియన్లను బీసీసీఐ పెన్షన్ స్కీం కిందకు చేరిస్తే వారికి సుదీర్ఘమైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది' అని సచిన్ పేర్కొన్నాడు.
కాగా, అంధుల వరల్డ్ కప్‌ని భారత్ వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో అంధుల జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా బీసీసీఐ తరఫున రివార్డు అందిస్తామని వినోద్ రాయ్ కూడా ప్రకటించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.