
మాంఛెస్టర్: అసలే ప్రతిష్ఠాత్మక మ్యాచ్. రెండు దేశాల ప్రజలు, క్రికెట్ అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న మ్యాచ్ అది. ప్రపంచకప్‌లో తాము ఏనాడూ గెలవని ప్రత్యర్థిని ఢీ కొట్టాల్సిన సందర్భంలో పాకిస్తాన్ టీమ్ ఏం చేసిందో తెలుసా? మ్యాచ్‌కు ముందురోజు రాత్రి స్థానికంగా ఓ రెస్టారెంట్‌లో గడిపింది. తెల్లవారు జామున 2 గంటల వరకూ సర్ఫరాజ్ జట్టు రెస్టారెంట్‌లో పిజ్జాలు, బర్గర్లు తింటూ, హుక్కా పీలుస్తూ కాలక్షేపం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సరిగ్గా మ్యాచ్‌కు ముందురోజు రాత్రి పాకిస్తాన్ టీమ్‌కు పార్టీ ఇచ్చి, ఆ జట్టు ఓటమికి సానియా మీర్జా పరోక్షంగా కారణం అయ్యారని భారతీయ క్రికెట్ అభిమానులు ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నారు. కనీసం పోరాటం లేకుండా మ్యాచ్ ఏకపక్షంగా మారడానికి ఆ హైదరాబాదీ స్టార్ టెన్నిస్ ప్లేయర్ తనవంతు కృషి చేశారని ప్రశంసిస్తున్నారు. ఇకపై పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్‌కు ముందురోజు రాత్రి ఆమె అదే పని చేయాలని కోరుతున్నారు.
మీడియా ముందే భోరుమని ఏడ్చేసిన పాక్ అభిమాని..
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య, హైదరాబాద్‌కు చెందిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు శనివారం రాత్రి మాంఛెస్టర్‌లోని విమ్‌స్లో రోడ్‌లో గల 360 శీషా లాంజ్ రెస్టారెంట్‌లో పార్టీ ఇచ్చిందని పాక్ అభిమానులు చెబుతున్నారు. ఈ పార్టీలో సర్ఫరాజ్ అహ్మద్ పిజ్జా, బర్గర్లు తిన్నారని, అందుకే మ్యాచ్ సందర్భంగా ఆవిలిస్తూ బద్ధకంగా కనిపించాడని ఆరోపిస్తున్నారు. తమ దేశ జట్టు కనీసం పోరాట పటిమ ప్రదర్శించకుండా ఘోరంగా ఓడిపోయినందుకు ఓ అభిమాని మీడియా ముందే భోరుమన్నాడు.