హైదరాబాద్: ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, ప్రముఖ దళిత నేత ఉదిత్ రాజ్ తాజాగా కొత్త వివాదానికి తెరతీశారు. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ దళితుడు కావడం వల్లే అతడు క్రికెట్ నుంచి కనుమరుగయ్యాడని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
'దళితుడినని ఒప్పుకోవడంలో వినోద్ కాంబ్లీ సిగ్గుపడకూడదు. అలాగే క్రికెట్ నుంచి కనుమరుగు కావడానికి కారణం అదే' అని ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు.
ఉదిత్ రాజ్ ట్వీట్‌పై క్రికెటర్ కాంబ్లీ కాస్తంత ఘాటుగా సమాధానమిచ్చారు. తన కులానికి, క్రికెట్ కెరీర్‌కు ఎలాంటి సంబంధం లేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'మిస్టర్ రాజ్ మీ ప్రకటనలను నేను సమర్థించడం లేదు. కాబట్టి దయచేసి నా పేరును ఇకముందు ఉపయోగించకండి' అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే ట్విట్టర్‌లో ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా ఉన్నట్టు లేదని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మరొకరు ట్విట్టర్‌లో ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, అతని చిన్ననాటి స్నేహితుడైన వినోద్ కాంబ్లీ ఒకేసారి క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, సచిన్ తరహాలో కాంబ్లీ నిలదొక్కుకోలేకపోయాడు. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్‌లో సచిన్ ఎన్నో రికార్డులను సృష్టించగా, అనతికాలంలోనే జాతీయ జట్టు నుంచి కాంబ్లీ కనుమరుగయ్యాడు.