న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ క్రికెట్ సిరీస్ పైన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు మండిపడ్డారు. ఆయన లోకసభలో దీనిని గట్టిగా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. భారత్ - పాకిస్తాన్ సిరీస్ ఈ డిసెంబర్ నెలలో ఉండవచ్చునని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ లోకసభలో మాట్లాడుతూ... దీనిని తాను గట్టిగా వ్యతిరేకిస్తానని చెప్పారు. 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ విడుదల అంశాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన పైన దాడులకు పాల్పడ్డ వారితో సిరీస్ ఎందుకో అర్థం కావట్లేదన్నారు.
తీవ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశంతో, మన పైన దాడులకు పాల్పడుతున్న దేశంతో క్రికెట్ ఆడటంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పినట్లుగా దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ దేశంలోనే ఉన్నాడని, ప్రతిరోజు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులను పంపిస్తున్న దేశంతో స్నేహపూర్వక సంబంధాలులేవని, కాబట్టి క్రికెట్ సిరీస్ విషయాన్ని పునఃసమీక్షించాలన్నారు.
కాగా, సుదీర్ఘ విరామం తర్వాత దాయాది దేశాలైన భారత్, పాకిస్ధాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరిస్ జరపాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందడమే ఆలస్యం. పాకిస్ధాన్ హోం సిరిస్‌గా భావించే ఈ సిరిస్‌లో టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీట్వంటీ మ్యాచ్‌లు ఆడనుంది.

ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ సిరిస్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాకిస్ధాన్ ఈ సిరిస్‌ని తటస్ధ వేదికైన యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించనుంది. పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యార్ ఖాన్, బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియాతో సమావేశమైన అనంతరం మీడియాతో ఈ సిరిస్ గురించి వెల్లడించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇండో-పాక్ సిరిస్‌ని తిరిగి నిర్వహించాల్సిందిగా దాల్మియాను విజ్ఞప్తి చేశామన్నారు. ఇండో-పాక్ క్రికెట్‌కు ఇదొ కొత్త నాంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సిరిస్‌లో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ20లు ఉంటాయని అన్నారు.
ఈ సిరిస్ నిర్వహణకు బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఐపీఎల్ లో ఆడేందుకు పాక్ క్రికెటర్లను అనుమతించాలని పీసీబీ చీఫ్ దాల్మియాను కోరారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల అనంతరం భారత్, పాక్ మధ్య క్రీడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.