టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి తిరిగి బౌలింగ్ చేస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్-2023 అనంతరం షమి టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. చీలమండల గాయానికి శస్త్రచికిత్స చేసుకోవడంతో కొన్ని నెలల పాటు షమి నడవడానికే ఇబ్బంది పడ్డాడు. క్రమంగా కోలుకున్న షమి మునపటిలా బంతులు సంధిస్తున్నాడు.
బంగ్లాదేశ్ లేదా న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు షమి తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ నుంచి భారత్ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, కివీస్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. బంగ్లాతో సెప్టెంబర్ 19, న్యూజిలాండ్‌తో అక్టోబర్ 16తో మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోపు షమి పూర్తి ఫిట్‌నెస్ సాధించేలా కనిపిస్తున్నాడు.

వన్డే వరల్డ్ కప్-2023లో షమి నొప్పిని భరిస్తూనే, ఇంజెక్షన్లు తీసుకుంటూ భారత్ తరఫున గొప్పగా పోరాడిన సంగతి తెలిసిందే. 24 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై గెలవడంతో పాటు ఎన్నో ప్రధాన మ్యాచ్‌ల్లో భారత విజయాల్లో షమిదే కీలకపాత్ర. అయితే వరల్డ్ కప్ అనంతరం గాయం నుంచి కోలుకోవడానికి శ్రమించాడు. ఎన్సీఏలో చికిత్స తీసుకున్నాడు. అయినప్పటికీ గాయం తీవ్రత తగ్గకపోవడంతో లండన్‌లో చీలమండ సర్జరీ చేయించుకున్నాడు. దీంతో ఐపీఎల్-2024తో పాటు టీ20 వరల్డ్ కప్‌కు షమి దూరమయ్యాడు.
అయితే వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుండటంతో భారత జట్టులోకి షమి త్వరగా రావాలని బీసీసీఐ కోరుకుంటుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న షమి వన్డే, టెస్టు ఫార్మాట్ జట్టులో కీలక సభ్యుడు. 64 టెస్టులు ఆడిన అతను 229 వికెట్లు పడగొట్టాడు. 101 వన్డేల్లో షమి 195 వికెట్లు తీశాడు. ఇక 23 టీ20ల్లో 24 వికెట్లు సాధించాడు.