Asia Cup 2025: ఆసియా కప్ 2025కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తిగా ఫిట్ కాలేదని ఒక నివేదిక వెల్లడించింది. ఆసియా కప్ ప్రారంభానికి కేవలం నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో అతని ఫిట్‌నెస్ జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ఈ సారి టీ-20 ఫార్మాట్లో జరగనుంది. కాబట్టి భారత టీ-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌గా ఉండటం చాలా అవసరం.
సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్ అప్‌డేట్
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. సూర్య కుమార్ యాదవ్ 100 శాతం ఫిట్‌గా మారడానికి మరో వారం రోజులు పట్టవచ్చు. కొన్ని నెలల క్రితం సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో చికిత్స పొందుతున్నాడు. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ ఒక కీలకమై ఆటగాడు కాబట్టి అతను ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. కొన్ని రోజుల క్రితం సూర్యకుమార్ యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో సూర్య ఎన్సీఏలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ పరిగెత్తుతూ కనిపించాడు. మరో వైపు హార్దిక్ పాండ్యా కూడా ఆసియా కప్ కోసం ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో హార్దిక్ పాండ్యా కూడా భారత జట్టుకు కీలక పాత్ర పోషించగలడు.

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యుకుమార్ యాదవ్
సూర్య కుమార్ యాదవ్ చివరిసారిగా ఐపీఎల్ 2025 ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఆ సీజన్లో సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా రాణించి 717 పరుగులు చేసి 'మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్' అవార్డును గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వడంతో సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. తన కెప్టెన్సీలో 22 మ్యాచ్‌లకు గానూ 17 మ్యాచ్‌లలో భారత్‌ను గెలిపించాడు.
ఆసియా కప్ 2025 షెడ్యూల్
ఆసియా కప్ 2025లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఇక ఎప్పటిలాగే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. సూర్య కుమార్ యాదవ్ ఫిట్‌నెస్ టీమిండియాకు ఆందోళనకు కలిగించినప్పటికీ అతడు త్వరగా కోలుకుని జట్టుతో చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు.