ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోన్న బిగ్ బాష్ లీగ్ (BBL) ఇక భారత్ లో కూడా సందడి చేయబోతోంది. బీబీఎల్ నెక్స్ట్ సీజన్ మ్యాచ్ లను భారత్ లో నిర్వహించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ప్రత్యేకించి ఐపీఎల్ కు పుట్టినిల్లుగా భావిస్తోన్న చెన్నై చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ లను నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్రమంలో- తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ను కూడా ఇప్పటికే సంప్రదించింది కూడా.
ఈ విషయాన్ని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించింది. చెన్నైలో బిగ్ బాష్ లీగ్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌ను నిర్వహించాలనే ప్రతిపాదన అందినట్లు తెలిపింది. దీనిపై చర్చించడానికి ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులు తమతో సమావేశమైనట్లు వెల్లడించింది. బీబీఎల్ ఓపెనర్ ను చెపాక్ లో నిర్వహించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఆసక్తిగా ఉందని పేర్కొంది. ఈ ప్రతిపాదనపై బీసీసీఐ తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వివరించినట్లు క్రిక్ బజ్ తెలిపింది.

బిగ్ బాష్ లీగ్ నుండి ఇద్దరు, క్రికెట్ ఆస్ట్రేలియా నుండి ఒక అధికారి కలిపి మొత్తం ముగ్గురు సభ్యుల ఆ ప్రతినిధి బృందం కిందటి వారమే చెన్నైకి వచ్చినట్లు క్రిక్ బజ్ పేర్కొంది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ నుండి ఆమోదం లభిస్తే.. ఈ ఏడాది డిసెంబర్‌లో బీబీఎల్ తొలి మ్యాచ్ కు చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వడం లాంఛనప్రాయమే అవుతుంది. ఇప్పటివరకు ఈ ప్రతిపాదనలపై బీసీసీఐ స్పందించలేదని, ప్రస్తుతం ఇవి పరిశీలన దశలో ఉన్నాయని టీ ఎన్ సీ ఏ వివరించింది.
ఐపీఎల్ ప్రతి సీజన్ కూడా విజయవంతం అవుతోండటంతో ప్రారంభ దశలో బీబీఎల్ ఓపెనర్ ను ఇక్కడ నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇది కూడా సక్సెస్ అయితే సగం మ్యాచ్ లను చెన్నై చిదంబరం, బెంగళూరు చిన్నస్వామి, ముంబై వాంఖెడే, ఢిల్లీ అరుణ్ జైట్లీ/అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియాల్లో నిర్వహించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఆయా నగరాల్లో క్రికెట్ కు లభిస్తోన్న ఆదరణ అంతా ఇంతా కాదు. మ్యాచ్ లు జరిగిన ప్రతీసారీ వేల సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియాలకు వస్తుంటారు.
బీబీఎల్ ఎనిమిది ఫ్రాంచైజీల్లో పెర్త్ స్కార్చర్స్ జట్టు.. చెన్నై మ్యాచ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఐపీఎల్ మాదిరిగా ఆ ఏడాది ఛాంపియన్‌లతో సీజన్‌ను ప్రారంభించే సంప్రదాయం బిగ్‌బాష్ లీగ్ లో లేదు. అలాగే పెర్త్ స్కార్చర్స్ జట్టులో ప్రస్తుతానికి పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఎవరూ లేరు. ప్రత్యర్థి జట్టులో ఉండే అవకాశం ఉంది. గత బీబీఎల్ సీజన్‌లో బాబర్ ఆజమ్ (సిడ్నీ సిక్సర్స్), మహమ్మద్ రిజ్వాన్ (మెల్‌బోర్న్ రెనెగేడ్స్), హరీస్ రవూఫ్ (మెల్‌బోర్న్ స్టార్స్), షాహీన్ షా అఫ్రిది, జమాన్ ఖాన్ (బ్రిస్బేన్ హీట్), హసన్ అలీ (అడిలైడ్ స్ట్రైకర్స్), షాదాబ్ ఖాన్ (సిడ్నీ థండర్) ఆడారు.