
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. 352/8 వద్ద టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది.
అయితే రెండో ఇన్నింగ్స్ ఆదిలోనే శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. ఓపెనర్ సమరవిక్రమ్ తొలి ఓవర్ చివరి బంతికి పెవిలియన్‌కు పంపాడు. టెస్టుల్లో భువికిది 50వ వికెట్ కావడం విశేషం.
ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 50 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భువీ నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోతున్నారు.
ఐదోరోజైన సోమవారం 14 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. నాలుగో వికెట్‌గా లంక మాజీ కెప్టెన్ మాథ్యూస్ 11వ ఓవర్లో ఉమేష్ యాదవ్ విసిరిన బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. 23 బంతులాడిన మాథ్యూస్ 12 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో నిరోషన్ డిక్‌వెల్లా 1, దినేష్ చంఢీమాల్ 6 పరుగులతో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.