
హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. సఫారీ గడ్డపై భారత బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించే సత్తా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఉందని 'మైసూర్ ఎక్స్‌ప్రెస్'గా పేరుగాంచిన మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ అభిప్రాయపడ్డాడు.
మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ పర్యటన కోసం కోహ్లీసేన దక్షిణాఫ్రికాకు చేరుకుంది. ఇప్పటికే నెట్స్‌లో కఠోర్ సాధన చేస్తోంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా శుక్రవారం (జనవరి 5) నుంచి కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో శ్రీనాథ్ బుధవారం మీడియాతో మాట్లాడాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు గాను భారత పేసర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
'భారత జట్టులో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ బౌలింగ్ కాంబినేషన్ ఇది. గత ఏడాదిన్నర నుంచి టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. భువనేశ్వర్ కుమార్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. దానికి పిచ్ నుంచి కొంచెం పేస్ లభిస్తే చాలు.. అతను అలవోకగా వికెట్లు పడగొట్టగలడు' అని ప్రశంసల వర్షం కురిపించాడు.
'భారత్ జట్టుకి అతను పెద్ద ఆస్తి.. ముఖ్యంగా దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లపై అతను మరింత ప్రమాదకారి. గత ఏడాదన్నర కాలంగా భువీ చాలా మెరుగయ్యాడు. ఈ సఫారీ పర్యటనలో అతనే భారత జట్టుని ముందుండి నడిపిస్తాడని నా నమ్మకం' అని శ్రీనాథ్ వెల్లడించాడు.
మహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా వెలుగొందిన జవగళ్ శ్రీనాథ్ దక్షిణాఫ్రికాలో 8 టెస్టు మ్యాచ్‌లాడి 43 వికెట్లు తీశాడు. కాగా, సఫారీ గడ్డపై భారత జట్టు ఒక్క టెస్టు సిరిస్ కూడా ఇప్పటివరకు గెలవలేదు. దీంతో ఈ సిరిస్‌ను కోహ్లీసేన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.