కూతురిని అభిమానులకు పరిచయం చేసిన భువి.. ఫోటో వైరల్

టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ గత నెల చివర్లో తండ్రైన సంగతి తెలిసిందే. భువీ భార్య నుపుర్ నగర్ గత నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. టీమిండియాలో స్టార్ బౌలర్ అయిన భువనేశ్వర్‌కు గత నెలలో తన నాలుగో వివాహ వార్షికోత్సవం జరుపుకున్న మరుసటి రోజే కూతురు పుట్టింది. దీంతో ఈ వివాహ వార్షికోత్సవం భువి కెరీర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. కాగా తాజాగా తన కూతురిని అభిమానులకు పరిచయం చేశాడు భువి. తన కూతురి ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.
ఆ ఫోటోలో తన రెండు చేతులతో కూతురుని ఎత్తుకుని తనవైపే భువి చూస్తుండగా.. అతని భార్య నుపుర్ కూడా భువి చేతిలో ఉన్న కూతురు వైపు అలాగే చూస్తూ ఉంది. దీంతో భువికి పలువురు క్రికెటర్లతోపాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కూతురికి ఏం పేరు పెట్టారనే విషయాన్ని కానీ, అసలు పేరు పెట్టారా? లేదా? అనే విషయాన్ని కూడా భువి వెల్లడించలేదు. దీంతో అభిమానులు కూతురికి ఏం పేరు పెట్టావు భువి అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరి కొందరైతే పలానా పేరు పెట్టమని భువికి సూచిస్తున్నారు.

భువి తండ్రి కన్నుమూత
ఈ ఏడాది మే 20న భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి భువి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన కన్నుమూశారు. ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకున్నాక ఆయన చాలా కాలంపాటు అనారోగ్యంతో బాధపడ్డారు. ఢిల్లీలో కీమోథెరపీ కూడా చేయించుకున్నారు. అయితే తండ్రి మరణం భువి ఆటపై కూడా ప్రభావం చూపింది. ప్రస్తుతం భువి గతంలో మాదిరిగా రాణించలేకపోతున్నాడు. కాగా ప్రస్తుతం కూతురు రాకతో భువితోపాటు ఇంటిలో మళ్లీ ఆనందమయం నెలకొంది.

ఆడ పిల్లలకు తండ్రుల లిస్ట్‌లో భువి
టీమిండియాలో ఉన్న మెజారిటీ ఆటగాళ్లకు ఆడపిల్లలే పుట్టారు. తాజాగా కూతురు పుట్టడంతో భువనేశ్వర్‌కుమార్ కూడా అదే లిస్ట్‌లో చేరిపోయాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనితోపాటు ప్రస్తుత కెప్టెన్లు రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడపిల్లలకు తండ్రులే. వీరితోపాటు సురేష్ రైనా, అజింక్యా రహానే, అశ్విన్, చటేశ్వర్ పుజారాకు కూడా కూతుళ్లే జన్మించారు.

భువనేశ్వర్ కెరీర్
కొంతకాలంగా టీమిండియా టెస్ట్ జట్టులో చోటు లేకపోయినప్పటికీ వన్డే, టీ20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు భువనేశ్వర్ కుమార్. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 119 వన్డే మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 141 వికెట్లు పడగొట్టాడు. 55 టీ20 మ్యాచ్‌ల్లో 53 వికెట్లు పడగొట్టాడు. 21 టెస్టు మ్యాచ్‌ల్లో 63 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు భువి ఎంపిక కానప్పటికీ, వన్డే సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications