
ఎప్పుడు కోలుకుంటానో చెప్పలేను:
స్పోర్ట్స్ వేర్ సంస్థ 'అసిక్స్' ప్రచార కార్యక్రమంలో భాగంగా భువనేశ్వర్ ఆదివారం నగరానికి వచ్చాడు. ఈ సందర్భంగా భువీ మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్ కోసం ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. దానిగురించి ఇపుడే ఆలోచించడం లేదు. గాయం నుంచి కోలుకోవడమే నా తొలి ప్రాధాన్యత. ఫిట్‌గా మారడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టా. అయితే ఎప్పుడు పూర్తిగా కోలుకుంటానో చెప్పలేను' అని అన్నాడు.

వైద్యుడి సలహా మేరకే భవిష్యత్ కార్యాచరణ:
కొన్నాళ్ల క్రితం వరకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లోనే కోలుకొని సాధన చేసిన భువీ గాయం మళ్లీ తిరగబెట్టింది. ఎన్‌సీఏలో ఉన్న సౌకర్యాల గురించి విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై తాను ఏమీ చెప్పలేనని భువీ పేర్కొన్నాడు. 'నా గాయం పట్ల ఎన్‌సీఏ బాగానే ప్రయత్నించి ఉండొచ్చు. అయితే అక్కడేం జరిగిందో తెలీదు. వాళ్లు నా సమస్యను గుర్తించలేకపోయారు. ఈ విషయంపై నేను మాట్లాడటం సరికాదు. బీసీసీఐ సరైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా. వైద్యుడి సలహా మేరకే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది' అని భువీ పేర్కొన్నాడు.

గాయాలు ఆటలో భాగమే:
'గాయాలు చిరాకు తెప్పించినా కుంగిపోను. ఆటలో ఇవన్నీ భాగమే. తిరిగి జట్టులోకి వచ్చాక అత్యుత్తమంగా రాణించాలని కోరుకుంటున్నా. టీ20 ప్రపంచకప్‌లో చోటు కోసం ఎదురు చూడట్లేదు. ఇప్పుడు కుటుంబంతో చాలా సమయం గడుపుతున్నా. మ్యాచ్‌లు ఉంటే ఇలాంటి సమయం దొరకదు' అని భువీ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లు గాయపడితే ఎన్‌సీఏకు వెళ్లడం సరైనదేనా అని అడిగిన ప్రశ్నకు అది వారి వ్యక్తిగత నిర్ణయమని చెప్పాడు.

ప్రధాన బౌలర్లలో ఒకడు:
భారత్ తరఫున భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు 212 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 63 వికెట్లు, వన్డేల్లో 132, టీ20ల్లో 41 వికెట్లు సాధించాడు. భారత ప్రధాన బౌలర్లలో భువీ ఒకడు. ఇటీవలి కాలంలో భువీ తరచూ గాయాలపాలవుతున్నాడు.


Click it and Unblock the Notifications












