దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ తిరిగి ఆడాడు. 2018లో చివరిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన భువీ ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్ తరపున బరిలోకి దిగిన భువనేశ్వర్.. బెంగాల్ బ్యాటర్లను వణికించాడు. అతడి బంతుల్ని డిఫెండ్ చేయాలన్నా బెదిరిపోయేలా బౌలింగ్ చేశాడు.
ఇన్ స్వింగర్స్, ఔట్ స్వింగర్స్‌తో ప్రత్యర్థిని తికమకపెడ్డాడు. యూపీ జట్టు అయిదు వికెట్లు తీయగా అవన్నీ భువనేశ్వర్ ఖాతాలోనే పడ్డాయి. దీన్ని బట్టి అర్థమై ఉంటుంది భువీ ఎంతలా చెలరేగాడో! అయిదు వికెట్లు తీసిన భువనేశ్వర్ ఇద్దరిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో ఒకరిని క్లీన్ బౌల్డ్ చేయగా, మరో ఇద్దరు వికెట్ కీపర్ చేతికి చిక్కారు.

ఈ నేపథ్యంలో భువనేశ్వర్ పేరు నెట్టింట్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. భువీకి సంబంధించిన పోస్ట్‌లు వైరల్‌గా మారుతున్నాయి. జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో భువనేశ్వర్‌ను ఎంపిక చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భువీ ప్రదర్శనను కనీసం ఇప్పుడైనా సెలక్టర్లు చూడాలని, అసలు భువీని గుర్తు పట్టారా? అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్‌లో భువనేశ్వర్ సన్‌రైజర్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలోనే 60 పరుగులకు ఆలౌటైంది. సమర్థ్ సింగ్ (13) టాప్ స్కోరర్. యూపీ జట్టులో ముగ్గురు బ్యాటర్లే రెండంకెల స్కోరును అందుకున్నారు. బెంగాల్ బౌలర్లలో మహ్మద్ కైఫ్ నాలుగు వికెట్లు, సూరజ్ మూడు, ఇషాన్ పోరెల్ రెండు వికెట్లు తీశారు.
అనంతరం తొలి రోజు ఆట ముగిసేసరికి బెంగాల్ 95 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయింది. యూపీ కంటే 35 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శ్రేయాన్ష్ (37*), కరన్ లాల్ (8) క్రీజులో ఉన్నారు. భువనేశ్వర్ అయిదు వికెట్లు తీశాడు. కాగా, యూపీకి నితీశ్ రాణా, బెంగాల్‌కు మనోజ్ తివారీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.