
హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా మరికొద్ది గంటల్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌కి వేదిక కానుంది. భారత్-పాక్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఎగబడుతున్నారు.
దుబాయిలో ఉన్న అభిమానులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. మరికొందకు టీవీలకు అతుక్కుపోయారు. భారత్-పాక్ మ్యాచ్‌పై పేసర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి స్పందించారు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ "మన టీమ్ బలంగా ఉందని, మన దగ్గర బౌలర్లు-బ్యాట్స్‌మెన్లు బాగున్నారు" అని అన్నాడు.
"భువనేశ్వర్ భారత జట్టులో ఓ స్ట్రాంగ్ ప్లేయర్ అని, అతడు తప్పకుండా భారత్‌కు విజయాన్ని అందిస్తాడు" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌ను ఓడించే సత్తా భారత జట్టుకు ఉందని ఈ సందర్భంగా భువనేశ్వర్ తండ్రి తెలిపాడు. ఆసియా కప్ విషయానికి వస్తే ఇరు జట్లు 12 సార్లు తలపడగా... ఆరు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించిగా, పాకిస్థాన్ ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గింది.
ఒక మ్యాచ్ రద్దు అయింది. యూఏఈలో పాక్‌తో ఆడిన 26 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది ఏడుసార్లు మాత్రమే. యూఏఈలో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం పాకిస్థాన్‌దే పైచేయిగా నిలిచింది. యూఏఈ వేదికలో జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 19 సార్లు విజయం సాధించింది. టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గాయి.
తొలి గ్రూప్ మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు హాంకాంగ్‌పై విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గ్రూప్-ఏలో టాపర్‌గా నిలవాలని ఇరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి.