
ఆసియా కప్ టోర్నీ ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా సూపర్ 4లో ఇవ్వాళ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో మాత్రం ఘన విజయంతో టోర్నీ ముగించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు ఓ తీపి కానుకనిచ్చింది. మూడేళ్లుగా సెంచరీ లేక, ఫామ్ కోల్పోయి కింగ్ కోహ్లీ తన మునుపటి టచ్ చూపిస్తూ సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ నబీ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ టాస్ ఓడిపోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా దిగిన కోహ్లీ (122పరుగులు 61బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్లు నాటౌట్), కేఎల్ రాహుల్ (62పరుగులు 41బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) ఆఫ్ఘన్ బౌలర్లపై దండయాత్ర చేశారు. భారత్ నిర్ణీత 20ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 212పరుగులు చేసింది.
ఇక 213పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్‌ను భువనేశ్వర్ కుమార్ వణికించాడు. ఆసియా కప్ టోర్నీలో అన్ని జట్లపై చెలరేగిన ఆఫ్ఘనిస్థాన్ భారత్ ముందు తోకముడిచేలా తన బౌలింగ్ పటిమతో వణుకు పుట్టించాడు. భువీ 4ఓవర్లలో కేవలం 4పరుగులు మాత్రమే ఇచ్చి 1మెయిడిన్ సహా 5వికెట్లు పడగొట్టాడు. భువీ దెబ్బకు ఆఫ్ఘన్ బ్యాటర్లు క్రీజులో నిలబడాలంటేనే వణికారు. అతనితోపాటు అర్షదీప్, హుడా, అశ్విన్ తలా ఓ వికెట్ తీసి ఆఫ్ఘాన్ పతనాన్ని శాసించారు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఇబ్రహీం జార్డన్ (64పరుగులు 59బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) మినహా మరెవరూ రాణించలేదు. దీంతో 8వికెట్లకు 111పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 101పరుగుల భారీ తేడా విజయం భారత్ వశమైంది.
తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫరూఖ్