బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 9లో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టి టైటిల్ సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల వెనక అదృశ్య శక్తి పని చేసిందట. అతని వల్లే హైదరాబాద్ జట్టు టైటిల్ సొంతం చేసుకుందని చెబుతున్నాడు పర్పుల్ క్యాప్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.
ఫైనల్లో చేరినా కూడా హైదరాబాద్ కంటే కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టే గెలుస్తుందని చాలా మంది భావించారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ హైదరాబాద్ టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
బెంగళూరులో విధ్వంసక ఆటగాళ్లు క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివీలియర్స్, షేన్ వాట్సన్.. ఉన్నప్పటికీ హైదరాబాద్ బౌలర్లు వారిని కట్టడి చేశారు. కాగా, మ్యాచ్ ప్రారంభం నుంచి హైదరాబాద్ జట్టు గెలుస్తుందని నమ్మిన ఒకే ఒక వ్యక్తి, హైదరాబాద్ మెంటర్ వివియస్ లక్ష్మణ్. ఎప్పుడూ జట్టు వెన్నంటి ఉంటూ వారిలో ఆత్మస్తైర్యాన్ని నింపింది కూడా అతనేనట.
ఏ దశలోనైనా జట్టు బలాన్ని నమ్ముకోవాలి తప్ప అవతలి జట్టును అతిగా ఊహించుకుని భయపడాల్సిన అవసరం లేదని చెప్పాడట. ఇందుకోసమే భువనేశ్వర్ కుమార్.. జట్టు మెంటర్ లక్ష్మణ్‌ను అదృశ్య శక్తిగా అభివర్నించాడు. ప్రతి క్షణం జట్టుకు కావల్సిన నైతిక స్థైర్యాన్ని లక్ష్మణ్ అందించాడని తెలిపాడు.
ఇదే విషయాన్ని కప్పు గెలిచిన తర్వాత సన్‌రైజర్స్ కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో రన్‌రేటును గణనీయంగా తగ్గించడంలో స్పెషలిస్టుగా మారిన భువనేశ్వర్.. తమకు అదృశ్యశక్తిగా మద్దతు ఇచ్చిన లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు చెప్పాడు.
ఆయన చాలా కీలకంగా పనిచేశారని, తెరవెనుక ఆయన చేసిన కృషివల్లే తెరముందు తాము బాగా ఆడగలిగామని, తమకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ అని ట్వీట్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ హైదరాబాద్ గెలుపులో తన వంతు గొప్ప పాత్రను పోషించాడని తెలుస్తోంది.