
న్యూఢిల్లీ: టెస్టుల్లో భారత విజయవంతమైన పేస్ దళంకు మరో రెండేళ్లు ఎదురేలేదని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మతో కూడిన భారత పేస్ చతుష్టయం అద్భుత ప్రదర్శన చేస్తుందని కొనియాడారు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ దాకా వాళ్ల పేస్ పదును కొనసాగుతుందని అరుణ్ చెప్పారు. ఆ తర్వాత వెటరన్ పేసర్లు రిటైరైనా బుమ్రా దూకుడు అలాగే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మంగళవారం ఓ ఇంటర్వ్యూలో కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ... 'ప్రస్తుత టీమిండియా పేస్ దళం అద్భుతంగా రాణిస్తున్నది. ఒకవేళ నలుగురు ఫిట్‌గా ఉంటే.. బృందంగా వారిని కనీసం మరో రెండేండ్ల పాటు కొనసాగించడంలో మాకు ఎలాంటి సమస్య కనిపించడం లేదు. మరోవైపు మరికొందరు ప్రతిభావంతులైన యువ పేసర్లను గుర్తించాల్సిన అవసరం ఉంది. దీంతో బెంచ్ బలం పెరుగడంతో పాటు తర్వాత ఎవరన్న సందిగ్ధత ఉండదు' అని అన్నారు.
'జట్టులో ఎక్కువ మంది మంచి పేస్ బౌలర్లు అందుబాటులో ఉంటే పనిభారం ఎక్కువైనప్పుడు రొటేషన్ పద్ధతిని అమలు చేయవచ్చు. ముఖ్యమైన సిరీస్‌లకు స్టార్ పేసర్లను సిద్ధంగా ఉంచొచ్చు. కాంట్రాక్టు పరిధిలో ఉన్న స్పీడ్ బౌలర్లందరూ క్యాంప్‌లో ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటా. అలాగే దేశవాళీ క్రికెట్, భారత్-ఏ తరఫున రాణిస్తున్న బౌలర్లు (పేసర్లు, స్పిన్నర్లు) కూడా క్యాంప్‌లోనే ఉండాలనుకుంటా. అలా అయితే బౌలర్ల మధ్య సమన్వయం ఏర్పడడంతో పాటు ఆలోచనలు కూడా పంచుకోవచ్చు' అని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పేర్కొన్నారు.
'కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో బౌలర్లు ఉమ్మిని ఉపయోగించే అలవాటును దూరం చేసుకొవాలి. అయితే అలా చేసుకోవడం బౌలర్లకు కాస్త కష్టం. ప్రాక్టీస్ సమయంలో ఈ విషయంపై బౌలర్లు ప్రత్యేక దృష్టిసారించేలా చూస్తాం' అని భరత్ అరుణ్ చెప్పారు. క్రికెట్ పునఃప్రారంభమయ్యాక మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవ్వాలంటే ఆటగాళ్లకు కనీసం ఆరు వారాల ప్రాక్టీస్ అవసరమని టీమిండియా బౌలింగ్ కోచ్ అభిప్రాయపడ్డారు. టెస్టుల కోసం మరింత ఎక్కువ సమయం పట్టొచ్చని చెప్పుకొచ్చారు.
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన క్రికెట్ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ ప్లేయర్లకు ట్రైనింగ్‌ను ప్రారంభించగా.. నేషనల్ క్యాంపు నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా యోచిస్తోంది. మరోవైపు వచ్చే జూలైలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సంబంధించి వెస్టిండీస్ క్రికెటర్లు ట్రైనింగ్‌ను ప్రారంభించారు. కెన్సింగ్‌టన్ ఓవల్లో కెప్టెన్ జాసన్ హోల్డర్, క్రెయిగ్ బ్రాత్‌వైట్, షాయ్ హోప్, కీమర్ రోచ్, షేన్ డౌరిచ్, షమార్ బ్రుక్స్, రేమన్ రీఫర్‌లు ఖాళీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసారు.