బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో దారుణమైన పరాభవం ఎదురైన నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్ ప్లేయర్లతో పాటు ప్రధాన కోచ్ గంభీర్ పై కఠిన చర్యలకు బీసీసీఐ ఉపక్రమించినట్లు సమాచారం అందింది. అదేంటో కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం.
ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ను 1-3 తేడాతో టీమిండియా ఓడిపోయింది. అంతకుముందు స్వదేశంలోనూ న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన బీసీసీఐ.. పలు కీలక నిర్ణయాలు తీసుకుందట.

స్వేచ్ఛకు కత్తెర..
గతంలో ఎవరికీ ఇవ్వని అధికారాలు, స్వేచ్ఛను గంభీర్‌కు కల్పించింది బీసీసీఐ. జట్టు ఎంపిక, సహాయక కోచ్‌ల ఎంపికను గంభీర్ ఇష్టానికే వదిలేసింది. అయితే గంభీర్ మాత్రం, ఫలితాలను ఆశించిన స్థాయిలో సాధించలేకపోయాడు.ఈ నేపథ్యంలోనే బీసీసీఐ గంభీర్ స్వేచ్ఛకు కత్తెర వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరా మ్యాచ్‌లకు హాజరైనప్పుడు.. అతడికి టీమ్ ఇండియా బస చేసే హోటల్‌లోనే ఉండేలా వెసులుబాటు కల్పించేవారు. కానీ ఇక నుంచి అలాంటిది ఉండదని కథనాలు వస్తున్నాయి. అలానే స్టేడియంలోని వీఐపీ బాక్స్‌లో కూర్చొనే అవకాశం కూడా ఉండదట. సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తున్నారని తెలిసింది. ప్రదర్శన ఆధారంగానే మళ్లీ వారికి అవకాశం ఇస్తారట.
ఇక నుంచి రెండు వారాలే
సీనియర్ ప్లేయర్లు రోహిత్, విరాట్ కోహ్లీ కూడా సరైన ప్రదర్శన చేయట్లేదు. అందుకే సీనియర్ ప్లేయర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటుందట బీసీసీఐ. ఇక నుంచి తాము తీసుకెళ్లే లగేజీ 150 కేజీలకు మించి ఉంటే దానికి ఛార్జీలను ప్లేయర్లే చెల్లించాలట.
అలానే 2019 నుంచి టీమిండియా సీనియర్ ప్లేయర్స్ ఫారెన్ టూర్ లకు వెళ్లినప్పుడు.. వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా వెళ్లేలా బీసీసీఐ అనుమతి కల్పించింది. కానీ అది ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతోందని బీసీసీఐ అనుకుంటోంది. అందుకే ఇకపై విదేశీ పర్యటనలకు భార్యతో పాటు కుటుంబసభ్యులకు అనుమతి ఇవ్వరట. లేదంటే 45 రోజుల విదేశీ పర్యటనకు వెళ్తే.. అందులో కేవలం రెండు వారాల పాటే ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు ఉండేందుకు అనుమతిస్తారట.