హైదరాబాద్: ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఇంగ్లండ్‌కు చెందిన బెన్ స్టోక్స్ ఒకడు. న్యూజిలాండ్‌లో జన్మించిన బెన్ స్టోక్స్ గత కొన్నాళ్లుగా అటు బ్యాట్‌తోనూ ఇటు బౌలింగ్‌లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం బెన్ స్టోక్స్ వెస్టిండిస్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో బిజీగా ఉన్నాడు. అయినా సరే గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన ఓల్డ్ క్లబ్‌కు విరాళాలు సేకరించడం కోసం ఛారిటీ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. బెన్ స్టోక్స్ తన కెరీర్ తొలినాళ్లలో లాంగ్‌షైర్‌లోని కోకర్‌మౌత్ సీసీ క్లబ్ తరుపున ఆడాడు.
ఇప్పుడు ఆ క్లబ్ విరాళాల సేకరణ కోసం నిర్వహించిన ఓ ఛారిటీ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ పాల్గొన్నాడు. బెన్ స్టోక్స్ రాకతో ఈవెంట్‌కు కళ రావడంతో పాటు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ తరుపున ఇప్పటివరకు 36 టెస్టులాడి 2,201 పరుగులు చేశాడు.
టెస్టుల్లో 86 వికెట్లు తీసుకోగా, 59 వన్డేల్లో 1,554 పరుగులు చేసి 50 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో బెన్ స్టోక్స్‌ని పూణె రైజింగ్ జెయింట్స్ రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తద్వారా విదేశీ ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన బెన్ స్టోక్స్ 316 పరుగులతో పాటు 12 వికెట్లు తీశాడు. అంతేకాదు ఐపీఎల్ పదో సీజన్‌లో మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నాడు.