
113 పరుగుల తేడాతో విజయం:
మాంచెస్టర్‌లో సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు విండీస్‌కు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లండ్.. 198 పరుగులకే ఆలౌట్ చేసింది. షమర్ బ్రూక్స్ (136 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), జర్మయిన్ బ్లాక్‌వుడ్ (88 బంతుల్లో 7 ఫోర్లతో 55) హాఫ్ సెంచరీలు చేశారు. కెప్టెన్ జాసన్ హోల్డర్ (35) పర్లేదనిపించాడు. స్టువర్ట్ బ్రాడ్ మూడు వికెట్లు తీయగా.. వోక్స్, స్టోక్స్, బెస్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

స్టోక్స్ వీరవిహారం:
ఓవర్‌నైట్ స్కోరు 37/2తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. 129/3 వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన బెన్ స్టోక్స్ (78 నాటౌట్) వీరవిహారం చేశాడు. విండీస్ బౌలర్లను కనికరం లేకుండాబాదుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ఏకంగా ఓవర్‌కు 8.36 రన్‌రేట్‌తో ఇంగ్లండ్ ఆడటం విశేషం. స్టోక్స్‌కు రూట్ (22), పోప్ (12 నాటౌట్) సహకరించారు. కేవలం 11 ఓవర్లు సాగిన ఆటలో స్టోక్స్ జోరు ప్రదర్శించాడు. రోచ్ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అతను గాబ్రియెల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన ఓపెనర్‌గా స్టోక్స్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత హోల్డర్ బౌలింగ్‌లోనూ స్టోక్స్ వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో ఆధిక్యం 300 పరుగులు దాటింది. అనంతరం కొద్దిసేపటికే రూట్ జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
బ్రాడ్, వోక్స్ విజృంభణ:
లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 85 ఓవర్లలో 312 పరుగులు చేయాలి. దీంతో చివరి రోజు గెలుపు గురించి ఆలోచించడం కష్టమే. ఇక విండీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంభమైన తీరు చూస్తే గెలుపు సంగతి తర్వాత.. ఓటమిని తప్పించుకోవడం కష్టమే అని అర్థమైపోయింది. బ్రాడ్, వోక్స్‌ల ధాటికి విండీస్ 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ టాప్‌స్కోరర్ బ్రాత్‌వైట్ (12)తో పాటు క్యాంప్‌బెల్ (4), హోప్ (7), చేజ్ (6) పెవిలియన్‌కు వరుస కట్టేశారు. ఇక విండీస్‌కు డ్రా అవకాశమే లేదని అనిపించింది.
ఆదుకున్న బ్రూక్స్, బ్లాక్‌వుడ్:
అయితే ఈ దశలో బ్రూక్స్, బ్లాక్‌వుడ్ జోడీ గొప్ప పోరాటంతో జట్టుకు మళ్లీ డ్రా ఆశలు కల్పించింది. వీళ్లిద్దరూ 27.4 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దీంతో విండీస్ 137/4తో మెరుగైన స్థితికి చేరుకుంది. కానీ ఇదే సమయంలో బ్లాక్‌వుడ్ వికెట్ తీసిన స్టోక్స్.. ఇంగ్లండ్ విజయానికి బాటలు పరిచాడు. ఆ తర్వాత టపటపా వికెట్లు చేజార్చుకున్న విండీస్ ఓటమిని ఆహ్వనించింది. కెప్టెన్ హోల్డర్ కొద్దిగా పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. 15 ఓవర్ల ఆట మిగిలుండగానే విండీస్ కథ ముగిసింది. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఈనెల 24న మొదలవుతుంది.


Click it and Unblock the Notifications












