ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ విషయంలో మరోసారి యూటర్న్ తీసుకోనున్నట్లు తెలిపాడు. 33 ఏళ్ల స్టోక్స్ 2022లో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ముంగిట అతను తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. 2019 మెగాటోర్నీలో తరహాలో 2023లోనూ మ్యాజిక్ చేయాలనుకున్నాడు.
2019 వన్డే వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇంగ్లిష్ జట్టు తొలిసారి కప్‌ను సాధించడంలో ఈ ఆల్‌రౌండర్‌దే ప్రధానపాత్ర. కానీ 2023 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ సెమీస్‌కు కూడా చేరుకోలేకపోయింది. అఫ్గానిస్థాన్, శ్రీలంక చేతిలో కూడా ఓటమిపాలైంది. మరోవైపు బెన్ స్టోక్స్ ప్రదర్శన ఫర్వాలేదనపించింది.

నెదర్లాండ్స్‌పై సెంచరీ (108), ఆస్ట్రేలియాపై 64, పాకిస్థాన్‌పై 84 పరుగులు సాధించాడు. అయితే కేవలం బ్యాటర్‌గా మెగాటోర్నీలోకి అడుగుపెట్టిన స్టోక్స్ అన్ని మ్యాచ్‌లు ఆడలేదు. అయితే వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఈ ఫార్మాట్ గురించి బెన్ స్టోక్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా స్టోక్స్ ఎంపిక కాకపోవడం గురించి ఈసీబీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో.. బెన్ స్టోక్స్ తిరిగి రిటైర్మెంట్ తీసుకున్నాడని భావించారంతా.
కానీ అతను తిరిగి వన్డే ఫార్మాట్ ఆడాలని చూస్తున్నాడు. అయితే ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ తనని సంప్రదిస్తే తిరిగి వన్డే జట్టులోకి వస్తానని పేర్కొన్నాడు. గతంలో టెస్టులకు మాత్రమే కోచ్‌గా ఉన్న మెక్‌కల్లమ్ ఇటీవల అన్ని ఫార్మాట్లకు ఇంగ్లండ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. కోచ్ మెక్‌కల్లమ్- టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మంచి సన్నిహితులు. ఈ నేపథ్యంలో మెక్‌కల్లమ్ చెబితే స్టోక్స్ మరోసారి యూటర్న్ తీసుకోవాలని భావిస్తున్నాడు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకొని బెన్ స్టోక్స్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ వేదికగా ఈ ట్రోఫీ జరగనుంది. కాగా, బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ తరఫున 105 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 35.76 సగటుతో 6508 పరుగులు, 203 వికెట్లు తీశాడు. వన్డేల్లో 3463 పరుగులు, 74 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20ల్లో 935 పరుగులు, 26 వికెట్లు తీశాడు.