పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మరో టెస్టుకు రంగం సిద్ధమైంది. ముల్తాన్ వేదికగా రేపటి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. అయితే మీడియాలో అడిగిన ప్రశ్నకు స్టోక్స్ చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది. అసలేం జరిగిదంటే..
2022 మార్చి నుంచి స్వదేశంలో పాకిస్థాన్ ఒక్క టెస్టు కూడా విజయం సాధించలేకపోతుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు సాధించి కూడా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండు, మూడు టెస్టులకు స్టార్ క్రికెటర్లపై వేటు వేస్తూ జట్టును ఆదివారం ప్రకటించింది.

మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు అనుభవజ్ఞులైన షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్‌లను పాక్ సెలక్షన్ కమిటీ జట్టు నుంచి తప్పించింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గుహ్లామ్‌లతో పాటు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సజీద్ ఖాన్‌లకు అవకాశం ఇచ్చింది. షాన్ మసూద్ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును పాక్ బోర్డు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో బాబర్ అజామ్ వంటి స్టార్ ప్లేయర్లను తొలగించడంపై స్పందించాలని బెన్ స్టోక్స్‌ను అడిగారు. దీనికి బెన్ స్టోక్స్ ఇలా స్పందించాడు. 'అది పాకిస్థాన్ క్రికెట్ సమస్య. దాంతో నాకేం సంబంధం ఉంటుంది. నేనేం చేయగలను' అని బదులిచ్చాడు. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన బెన్ స్టోక్స్ రెండో టెస్టు నుంచి జట్టు పగ్గాలు అందుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ గెలవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. గత పాకిస్థాన్ పర్యటనలో మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.