హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శుక్రవారం కోచ్ అవతారం ఎత్తాడు. బెల్జియం రాజ దంపతులకు సెహ్వాగ్ ముంబైలో క్రికెట్ పాఠాలు నేర్పాడు.
అసలేం జరిగింది?
వారం రోజుల పర్యటన నిమిత్తం బెల్జియం రాజు ఫిలిప్పి తన భార్య మథిల్డేతో కలిసి నవంబరు 6న భారత్‌కు వచ్చారు. పర్యటనలో భాగంగా వారు శుక్రవారం ముంబైలోని ఓవల్ మైదాన్‌ను వీరు సందర్శించారు. యునిసెఫ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా బెల్జియం రాజ దంపతులు స్కూల్ విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు.

అదే సమయంలో అక్కడే ఉన్న క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వారికి క్రికెట్‌లో మెలకువలను వివరించాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్ కోచ్ అవతారమెత్తాడు. ఓవెల్ మైదానంలో కింగ్ పిలిప్, క్వీన్ మథిల్డేలు కాసేపు సరదా సరదాగా గడిపారు. కింగ్ పిలిప్పి దంపతులిద్దరూ బ్యాటింగ్ చేశారు.

అనంతరం ఓ బ్యాట్‌ను ఆ దంపతులకు కానుకగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోని యునిసెఫ్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.