స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు వన్డే ఫార్మాట్ లో ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ యే దాదాపు చివరి మెగాటోర్నీ. ఇద్దరూ జట్టు బాధ్యతలను మోస్తూ నిలకడగా పరుగులు సాధించారు. టోర్నీలో రోహిత్ ప్రత్యర్థిపై మెరుపు దాడి చేస్తే.. మరోవైపు కోహ్లి ఇన్నింగ్స్ కు ఇరుసులా మారి భారీ స్కోరుకు బాటలు పరిచాడు. అయితే ఈ స్టార్ ప్లేయర్ల టీ20 ఫార్మాట్ భవిష్యత్ పై పెద్దఎత్తున చర్చ సాగుతోంది.
టీ20 ఫార్మాట్ లో ఫ్రెష్ అప్రోచ్ మంచి ఫలితాల్ని ఇస్తుందని, యువ క్రికెటర్లనే టీ20 ప్రపంచకప్ నకు ఎంపిక చేయాలని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇర్ఫాన్ పఠాన్ మాత్రం వెస్టిండీస్ పిచ్ లపై అనుభవం ఉన్న సీనియర్లు కోహ్లి, రోహిత్ జట్టుతో ఉండాలని ఇటీవల వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జూన్ లో వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా టీ20 ప్రపంచకప్ నకు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.

దీనిపై గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. కోహ్లి, రోహిత్ వయస్సు గురించి ఆలోచించవద్దని అన్నాడు. వయస్సు కంటే ఫామ్ చూడాలని తెలిపాడు. ''ఫామ్ ముఖ్యం. మంచి విషయం ఏంటంటే.. ఐపీఎల్ తర్వాత టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఐపీఎల్ రాణించి ఫామ్ లో ఉన్న వాళ్లను వరల్డ్ కప్ నకు ఎంపిక చేయాలి. రోహిత్, కోహ్లి ఐపీఎల్ లో రాణిస్తే.. వయస్సును ఆలోచించకుండా సెలక్ట్ చేయాలి'' అని గంభీర్ తన అభిప్రాయాన్ని వివరించాడు.
రోహిత్, కోహ్లి టీ20 ఫార్మాట్ లో టీమిండియా జెర్సీని ఆఖరిగా 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ధరించారు. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ కు దూరమయ్యారు. 2023 వన్డే వరల్డ్ కప్, టెస్టు ఫార్మాట్ ను దృష్టిలో ఉంచుకుని వారిద్దరికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. వన్డే కప్ అనంతరం ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు ఇవాళ నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా టీ20 సిరీస్ కు కూడా వారిద్దరిని సెలక్ట్ చేయలేదు.