
లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఓ రాజకీయ నాయకుడు క్రికెట్ ఆడుతున్నారు. ఆ రాజకీయ నాయకుడు తన దేశ క్రికెట్ జట్టుకు కేప్టెన్ కూడా. ఆయనే- బంగ్లాదేశ్ టీమ్ కేప్టెన్ ముష్రఫీ మొర్తాజా. బంగ్లాదేశ్‌లోని నరైల్-2 నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్రికెట్ ఆడుతూనే రాజకీయాల్లో చేరారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొర్తాజా నరైల్-2 నియోజవర్గం నుంచి ఆవామీ లీగ్ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయాన్ని సాధించారు.
ఆ ఎన్నికల్లో మొర్తాజాకు మొత్తం 2,71,210 ఓట్లు పోల్ అయ్యాయి. తన ప్రత్యర్థి, జటియా ఒక్యా ఫ్రంట్ అభ్యర్థి ఫరీదుజ్ జమాన్‌ను మట్టి కరిపించారు.ప్రపంచకప్‌లో భాగంగా- బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. అతని రాజకీయ జీవితానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
భవిష్యత్తులో బంగ్లాదేశ్ ప్రధాని అవుతారా? ఆ దిశగా ఏవైనా ప్రణాళికలు ఉన్నాయా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు మొర్తాజా తెలివిగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి తనకు అలాంటి ఆలోచన ఏదీ లేదని, టీమిండియాపై ఎలా విజయం సాధించాలనే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నానని అన్నారు. పార్లమెంట్‌కు ఎన్నిక కావడమే గొప్ప విషయమని చెప్పారు.