లండన్: అతి తక్కువ వయస్సులో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ సంచలనం అలిస్టర్ కుక్ మరో రికార్డును బ్రేక్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అది కూడా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ది కావడం విశేషం.
కాగా, ప్రపంచానికి క్రికెట్ పరిచయం చేసిన దేశమైనప్పటికీ ఇప్పటి వరకూ ఏ ఒక్క ఇంగ్లీష్ ఆటగాడికి టెస్టుల్లో 10వేల పరుగుల ఫీట్ సాధ్యపడలేదు. అయితే, దశాబ్దాలుగా తమ జట్టు ఆటగాళ్లకు సాధ్యంకాని అరుదైన ఫీట్ అందుకోవడానికి ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్.. కేవలం 36 పరుగుల దూరం ఉన్నాడు.
కుక్ ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ జట్టులో కొత్త ఉత్సాహం తీసుకొచ్చాడు. 10వేల పరుగులు క్లబ్‌లో చేరిన 12వ ఆటగాడిగా, తొలి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌గానూ రికార్డు సృష్టించనున్నాడు.
ఇక ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ కానుంది. ఈ సందర్భంగా కుక్ మాట్లాడుతూ.. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ రికార్డును బద్దలు కొట్టడం ఓ పెద్ద మైలురాయేనని చెప్పాడు. సచిన్ టెండూల్కర్ 200టెస్టుల్లో 15,921 పరుగులతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచిన విషయం తెలిసిందే.

విశేషమేంటంటే.. 10వేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ టెండూల్కర్ వయస్సు 31ఏళ్ల 10నెలలు.. కాగా, కుక్ వయస్సు ప్రస్తుతం 31ఏళ్ల 4 నెలలు. దీంతో 126 టెస్టుల్లో 9,964 పరుగులు చేసిన కుక్.. మరో 36 పరుగులు సాధిస్తే సచిన్ రికార్డు బద్దలవుతుంది.
ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య మే నెలలోనే టెస్ట్ సిరీస్ ఉన్నందున కుక్ తనకు అవసరమైన పరుగులు చేసి సచిన్ పేరిట ఉన్న ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. ఆ దిగ్గజం రికార్డు బ్రేక్ చేస్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని, ఇది తనకు ఓ మైలురాయి లాంటిదని పేర్కొన్నాడు.