
లీడ్స్: ప్రపంచకప్ టోర్నమెంట్ సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు అవమానం ఎదురైంది. లీడ్స్‌లోని హెడింగ్లే కార్నెజ్ స్టేడియంలో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా భారత్‌కు వ్యతిరేకంగా ఆకాశంలో ఓ బ్యానర్‌ను ప్రదర్శించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. జస్టిస్ ఫర్ కాశ్మీర్ అనే నినాదాన్ని రాసి ఉంచిన బ్యానర్‌ను ఆకాశంలో ప్రదర్శించారు. ఓ తేలికపాటి విమానానికి ఈ బ్యానర్‌ను కట్టి, గాల్లో ప్రదర్శించారు. రెండుసార్లు ఈ విమానం స్టేడియం మీదుగా చక్కర్లు కొట్టింది.
ఈ ఘటనను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్రంగా పరిగణించింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ రాసింది. తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ సందర్భంగా కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బలూచిస్తాన్‌కు విముక్తి కల్పించాలనే బ్యానర్‌ను ఇదే తరహాలో ప్రదర్శించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ రెండు ఘటనలు ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహణ లోపాలను ఎత్తి చూపుతున్నాయి.
దీనిపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. వెంటనే ఐసీసీకి లేఖ రాసింది. ఇదివరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా తొలిసారిగా వివాదాస్పద బ్యానర్‌ను ప్రదర్శించిన వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. అప్పుడే దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని ఉంటే- ఇప్పుడీ తాజా ఉదంతం చోటు చేసుకునేది కాదని అభిప్రాయపడింది. తాజాగా ప్రదర్శించిన బ్యానర్.. భారత దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేదిగా ఉందని బీసీసీఐ తన లేఖలో పేర్కొంది.