ముంబయి: ఐసీఎల్ క్రికెటర్లపై ఇప్పటివరకు విధించిన నిషేధాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎత్తివేసింది. ఐసీఎల్‌నుంచి తప్పుకుంటే వారిని తిరిగి చేర్చుకునేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. ముంబయిలో బుధవారం జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఐసీఎల్‌లో చేరిన అనేకమంది తాము తప్పు నిర్ణయం తీసుకున్నామని చేసిన పనికి చింతిస్తున్నామని తమకు లేఖలు రాశారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
భారత్ తరపున ఆడాలనుకునే ఐసీఎల్ క్రీడాకారులు మే 31లోగా అక్కడి నుంచి తప్పుకుంటే తాము చేర్చుకుంటామని ఆయన చెప్పారు. అయితే ఏడాది వరకు వారికి దేశవాళీ క్రికెట్‌లో మాత్రమే ఆడే అవకాశం ఇస్తామని, ఆ తరువాత అంతర్జాతీయస్ధాయిలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఐసిఎల్ ను జీ గ్రూపు యజమాని సుభాష్ చంద్ర ప్రారంభించారు. దాని కార్యవర్గ సంస్థ చైర్మన్ గా కపిల్ దేవ్ వ్యవహరిస్తున్నారు. బ్రియాన్ లారా, ఇంజమామ్ ఉల్ హక్, షేన్ బాండ్ వంటి ఉద్దండులు ఐసియల్ లో చేరారు.