న్యూఢిల్లీ: జట్టు ఎంపిక విషయాలు మీడియాకు లీక్ చేయడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్టర్లను హెచ్చరించింది. ఆర్పీ సింగ్ ను జట్టులోకి తీసుకోకపోతే తాను కెప్టెనుగా రాజీనామా చేస్తానని మహేంద్ర సింగ్ ధోనీ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై బిసిసిఐ సెలెక్టర్లపై గుర్రుమంది. సమావేశంలో జట్టు ఎంపిక విషయంలో జరిగే వివరాలను మీడియాకు లీక్ చేయవద్దని సెలెక్టర్లను హెచ్చరించినట్లు బిసిసిఐ వర్గాలు చెప్పాయి.
ధోనీ రాజీనామా హెచ్చరికలు మీడియాకు లీక్ కావడాన్ని బిసిసిఐ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బిసిసిఐ సెలెక్టర్లను హెచ్చరించింది. ఇంగ్లాండుపై జరిగిన రెండో వన్డేలో 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోని ఆర్పీ సింగ్ ను తొలగించి, ఇర్ఫాన్ పఠాన్ ను జట్టులోకి తీసుకున్నారు. సమావేశ వివరాలు లీక్ చేయడం మంచిది కాదని, ఒకవేళ అలా లీక్ చేయదలుచుకుంటే సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం మంచిదని ధోనీ వ్యాఖ్యానించారు.