IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మూడో వారంలోకి ప్రవేశం వేళ బీసీసీఐ కొన్ని కీలక నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా బెంచ్ పై ఉండే ప్లేయర్ల కదలికలు, స్టేడియంలోకి అదనపు ఆటగాళ్ల ప్రవేశంపై కఠిన ఆంక్షలు విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ కొత్త మార్పులు వెలుగులోకి వచ్చాయి.
ఐపీఎల్‌లో కొత్త రూల్స్
ఆట సమయం వృథా కాకుండా ఉండేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు బెంచ్‌పై ఉన్న ప్లేయర్లు స్టేడియం చుట్టూ ఇష్టానుసారంగా తిరగడానికి వీల్లేదు. అంతే కాకుండా.. జట్టు యాజమాన్యం అందించిన 16 మంది ఆటగాళ్ల జాబితాలో లేని వారు ఎవరూ మైదానంలోకి ప్రవేశించకూడదు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు పదే పదే డ్రింక్స్, బ్యాట్లు, గ్లోవ్స్ లేదా డగౌట్ నుంచి సందేశాలను మైదానంలోకి తీసుకురావడం వల్ల ఆట ఆలస్యం అవుతోందని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?
మ్యాచ్ ప్లేయింగ్ కండిషన్స్‌లోని (MPC) క్లాజ్ 11.5.2, క్లాజ్ 24.1.4లను బీసీసీఐ మరింత పటిష్టం చేసింది. దీని ప్రకారం.. కేవలం వికెట్ పడినప్పుడు లేదా బౌండరీ అంచున మాత్రమే ఆటగాళ్లకు డ్రింక్స్ ఇవ్వాలి. అంపైర్ల అనుమతి లేకుండా మైదానంలోకి పానీయాలు తీసుకురాకూడదు. స్టేడియంలోకి వచ్చే ఏ ఆటగాడైనా కచ్చితంగా క్రికెట్ దుస్తులు ధరించి ఉండాలి. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌లుగా లేని ఆటగాళ్లు బౌండరీ మరియు కంచె మధ్య ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా టీమ్ ట్రైనింగ్ బిబ్స్ ధరించాల్సి ఉంటుంది.
క్యాచ్‌ల విషయంలో స్పష్టత
గతంలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో అంపైర్ నితిన్ మీనన్, మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ ఫీల్డర్ల కదలికలపై స్పష్టతనిచ్చారు. ఓ క్యాచ్‌ను పూర్తి చేసినట్లు పరిగణించాలంటే.. ఫీల్డర్ బంతిపై, తన శరీరంపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉండాలని, ఆ తర్వాతే సంబరాలు మొదలుపెట్టాలని 10 మంది కెప్టెన్లకు సూచించారు. వివాదాస్పద క్యాచ్‌ల విషయంలో గందరగోళాన్ని తొలగించేందుకు ఈ రూల్‌ను గుర్తు చేశారు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఇప్పట్లో మారదు!
చాలా మంది కెప్టెన్లు 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. బీసీసీఐ మాత్రం దీనిని మరో రెండు సీజన్ల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. 2027 సీజన్ తర్వాతే ఈ నిబంధనపై సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు సీజన్‌లోని 14వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. జోస్ బట్లర్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ సీజన్‌లో ఢిల్లీ ఇప్పటికే రెండు వరుస విజయాలతో ఊపులో ఉండగా.. గుజరాత్ తన తొలి గెలుపు కోసం పోరాడుతోంది.