ముంబై: ఐపీఎల్‌లోకి పుణే, రాజ్‌కోట్.. రెండు కొత్త జట్లు వచ్చాయి. సస్పెన్షన్‌లో ఉన్న చెన్నై, రాజస్థాన్‌ల స్థానంలో వచ్చే రెండేళ్లకు బీసీసీఐ కొత్త ఫ్రాంఛైజీల్ని ప్రకటించింది. పుణె కేంద్రంగా ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని న్యూ రైజింగ్ కన్సార్టియం ఓ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది.
మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఇంటెక్స్ రాజ్‌కోట్ వేదికగా మరో ఫ్రాంఛైజీని దక్కించుకుంది. ఈ రెండింటినీ కలుపుకుని ఎనిమిది ఫ్రాంఛైజీలతో తర్వాత రెండు రెండు సీజన్లు నిర్వహిస్తారు. ఐపీఎల్-9 వచ్చే ఏడాది ఏప్రిల్ 9న ఆరంభమై మే 29న ముగుస్తుంది.
బీసీసీఐ నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియ బోర్డుకు మంచి ఫలితాన్నే ఇచ్చింది. బోర్డు అనుకున్నదాని కంటే ఎక్కువ లాభం చేకూర్చేలా బిడ్డింగ్ ప్రక్రియ సాగింది. అవసరమైతే ఫ్రాంఛైజీల నిర్వహణకు ఎదురు డబ్బులు ఇవ్వడానికీ సిద్ధపడుతూ బోర్డు రివర్స్ బిడ్డింగ్ పద్ధతిని ఎంచుకోగా.. బోర్డుకే ఎదురు చెల్లించేందుకు సంస్థలు పోటీ పడ్డాయి.

ఇందులో బోర్డుకు అత్యధిక ప్రయోజనం చేకూర్చేలా బిడ్‌లు వేసిన న్యూ రైజ్, ఇంటెక్స్ సంస్థలకు ఫ్రాంఛైజీలు కట్టబెట్టారు. న్యూ రైజింగ్ కన్సార్టియం బోర్డుకు ఏడాదికి రూ.16 కోట్ల చొప్పున చెల్లించే ఒప్పందంతో పుణె కేంద్రంగా ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది.
రాజ్‌కోట్ కేంద్రంగా ఫ్రాంఛైజీని దక్కించుకున్న ఇంటెక్స్ ఏడాదికి రూ.10 కోట్ల చొప్పున చెల్లించనుంది. ఫాంఛైజీకి బోర్డు అత్యధికంగా రూ.40 కోట్లు చెల్లించేలా రివర్స్ బిడ్డింగ్‌ను ఆరంభించారు. బిడ్డింగ్‌లో పాల్గొనే సంస్థలు అంత కంటే ఎక్కువ బిడ్ వేయకూడదు. ఎవరు అత్యల్ప బిడ్ వేస్తే వారికే ఫ్రాంఛైజీ సొంతం.
ఐతే న్యూ రైజింగ్, ఇంటెక్స్ సంస్థలు మైనస్‌ల్లో బిడ్డింగ్ వేశాయి. తద్వారా బోర్డుకే డబ్బులు చెల్లించడానికి ముందుకొచ్చాయి. బీసీసీఐ నుంచి ఈ సంస్థలు ఒక్క రూపాయి కూడా తీసుకోవని, అవే బోర్డుకు డబ్బులిస్తాయని కొత్త ఫ్రాంఛైజీల్ని ప్రకటించేందుకు ముందు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చెప్పాడు.
కొత్త ఫ్రాంఛైజీల రాకతో బీసీసీఐ పంట పండిందంటున్నారు. బీసీసీఐ సీనియర్ అధికారి, సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు నిరంజన్ షా లెక్క ప్రకారం... ఈ ఫ్రాంఛైజీల కారణంగా బీసీసీఐకి అదనంగా రూ.332 కోట్ల ఆదాయం సమకూరుతోంది.
'ప్రతి ఫ్రాంఛైజీకి బీసీసీఐ ఆదాయం నుంచి ఏటా రూ.70 కోట్లు చెల్లించాలి. ఐతే కొత్త ఫ్రాంఛైజీలు ఆ ఆదాయాన్ని కోరుకోవడం లేదు. అంటే రెండేళ్లకు రెండు ఫ్రాంఛైజీలకు కలిపి రూ.280 కోట్లు మిగులు. పైగా బోర్డుకే రెండు ఫ్రాంఛైజీలు రూ.16 కోట్లు, రూ.10 కోట్ల చొప్పున చెల్లించనున్నాయి. ఈ మొత్తం కూడా కలిపితే బోర్డుకు రూ.332 కోట్ల ఆదాయం అదనంగా వస్తోంద'ని చెప్పాడు.