ముంబై: టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే విషయమై టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని కమిటీ మంగళవారం ఇంటర్యూ ప్రక్రియను ముగించిన సంగతి తెలిసిందే.
కోచ్ ఎవరన్నదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి కమిటీ వచ్చింది. బుధవారం సాయంత్రానికి బీసీసీఐకి నివేదిక అందించనుంది. టీమిండియాకు కొత్త కోచ్ ఎవరనే దానిపై శుక్రవారం బీసీసీఐ వర్కింగ్ కమిటీలో చర్చించిన అనంతరం కోచ్ పేరుని ప్రకటించనున్నారు.
కాగా, టీమిండియా కోచ్ పదవికి మొత్తం 57 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో నుంచి 21 మంది మాత్రమే ఇంటర్యూకి ఎంపిక చేశారు. చివరకు ఈ ముఖాముఖి ఇంటర్యూకి కేవలం పది మందికి మాత్రమే నిర్వహించారు. వీరిలో కోచ్ పదవికి రేసులో అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి ముందున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో వీరిద్దరిలో కోచ్‌గా ఎవరైతే బాగుంటుందని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ కోరింది. కోహ్లీ తన సూచనను బుధవారానికి బీసీసీఐకి తెలియజేయనున్నారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ అనిల్ కుంబ్లేతో పాటు భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు ఇంటర్యూలకు హాజరైన వారిలో ఉన్నారు.
హెడ్ కోచ్ పదవికి పోటీదారుల్లో ఒకడైన రవిశాస్త్రి ఇంటర్వ్యూకు వ్యక్తిగతంగా హాజరవలేదు. ప్రస్తుతం రవిశాస్త్రి థాయిలాండ్ పర్యటనలో ఉన్నారు. దీంతో రవిశాస్త్రిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్యూ చేశారు. ఇక ఇటీవలే ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా మాజీ పేసర్ టామ్ మూడీ, ఆ దేశానికే చెందిన స్టువర్ట్ లా కూడా ఇదే తరహాలో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
'కోచ్‌గా మిమ్మల్ని ఎందుకు నియమించాలి?', 'విదేశీ పర్యటనల్లో భారత జట్టును గెలిపించడానికి ఏం చేస్తారు?' లాంటి ప్రశ్నల్ని బీసీసీఐ అడ్వైజరీ కమిటీ కోచ్ రేసులో ఉన్న అభ్యర్థులను అడిగినట్లుగా తెలుస్తోంది. అనుభవం, ప్రెజెంటేషన్ విషయంలో అందరికంటే ముందున్న కుంబ్లే వైపే కమిటీ మొగ్గుచూపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.