కోల్‌కత్తా: బీసీసీఐ అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా తిరిగి రావడం సంతోషంగా ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నారు. ఇప్పుడు బీసీసీఐ దాల్మియా చేతుల్లో సురక్షితంగా ఉంటుందని శుక్రవారం గంగూలీ పేర్కొన్నారు.
గత కొంతకాలంగా ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణాలు, భారత ఆటగాళ్లు, ప్రాంఛైజీ యాజమాన్యాల హస్తం ఇందులో ఉండటం బీసీసీఐని వివాదాల్లోకి నెట్టిన సంగతి తెలిసిందే. నిధులను దుర్వినియోగపరచారంటూ తొమ్మిదేళ్లక్రితం దాల్మియాను బీసీసీఐకి దూరంగా పెట్టారు.

అయితే ఇటీవల కొన్ని నాటకీయ పరిణామాల మధ్య జగ్మోహన్ దాల్మియా, శ్రీనివాసన్ మద్దతుతో తిరిగి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. " మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం. బీసీసీఐ అధ్యక్షుడిగా లేకపోయినా మీరంటే మాకు గౌరవం, ప్రేమ ఉన్నాయి. ఇది క్యాబ్‌కు మంచిది. భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం" అని దాల్మియాను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సత్కారాన్ని కార్యక్రమంలో గంగూలీ అన్నారు.
మీ రాకతో టీమిండియా చాలా సేఫ్‌గా ఉంటుందని గంగూలీ వ్యాఖ్యానించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా దాల్మియా తిరిగి ఎన్నికైన సందర్భంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌కు చెందిన ఉన్నతాధికారులు, కోచింగ్ క్లబ్స్, స్కూలు ప్రతినిధులు హాజరయ్యారు.