హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య పూణె వేదికగా జరగాల్సిన రెండో వన్డే కోసం పిచ్‌ని రూపొందించిన క్యూరేటర్‌పై జరిపిన స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తోంది. మరి కొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్న సమయంలో క్యూరేటర్ పాండురంగ సల్గొంకర్ మాట్లాడిన వీడియో, ఆడియో టేపు జాతీయ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన బీసీసీఐ, ఎమ్‌సీఏ ప్రతినిధులు క్యూరేటర్‌ను సస్పెండ్ చేశారు. పిచ్ క్యూరేటర్‌ను సస్పెండ్ చేశామని రెండో వన్డే జరగాలో? లేదో? మ్యాచ్ రిఫరీ నిర్ణయిస్తాడని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయంపై తాము దర్యాప్తును ప్రారంభించామని, ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభయ్ ఆప్టే తెలిపారు.

ఇండియా టుడే ఛానెల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం వెలుగు చూసింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలించేలా క్యూరేటర్ ఈ పిచ్‌ను తయారు చేసినట్లు స్పష్టంగా తేలింది. ఈ విషయాన్ని బీసీసీఐ చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనిపై బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మాట్లాడుతూ క్యూరేటర్ పై కఠిన చర్యలుంటాయని అన్నారు.
ఈ విషయాన్ని తాము విచారిస్తున్నామని, ఇప్పుడే నిర్ణయం చెప్పమనడం సరికాదని ఆయన అన్నారు. ఫిక్సింగ్, లంచాలను బీసీసీఐ సహించబోదని ఆయన స్పష్టం చేశారు. మరో బీసీసీఐ అధికారి మాట్లాడుతూ క్రికెట్ నియమ నిబంధనల గురించి ప్రతి అధికారికి, ఉద్యోగికీ తెలుసునని, డబ్బుకోసం ఇలా చేయడం ఎంతమాత్రం ఆక్షేపణీయం కాదని అన్నారు.
రిపోర్టర్లను పిచ్ వద్దకు తీసుకెళ్లిన క్యూరేటర్ పాండురంగ సల్గొంకర్‌తో పాటు, పూణె స్టేడియం అధికారులను కూడా కఠినంగా శిక్షించాల్సిందేనని మాజీ కెప్టెన్ అజాహరుద్దీన్ డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే...
బీసీసీఐ, ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా రిపోర్టర్లను క్యూరేటర్ పిచ్ వద్దకు తీసుకెళ్లాడు. క్రికెట్ బుకీల రూపంలో వచ్చిన రిపోర్టర్లతో పిచ్ క్యూరేటర్ మాట్లాడుతూ 'ఒకరిద్దరు ఆటగాళ్లు బౌన్సీ పిచ్ కావాలని కోరుతున్నారని, అది జరుగుతుందా?' అని అడగ్గా 'సరే, పిచ్ ను అలాగే మారుస్తా' అంటూ సమాధానమిచ్చాడు. అంతేకాదు పిచ్‌ను బ్యాటింగ్‌కు సహకరించేలా పిచ్‌ను తయారుచేస్తానని 337 నుంచి 340 పరుగుల చేసే అవకాశం ఉందని చెప్పి స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయాడు.